
రేపు వైఎస్సార్ సీపీ ‘చలో మెడికల్ కాలేజీ’
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైన కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ ఆ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ (శుక్రవారం) ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం నిర్వహిస్తోంది. పెనుకొండలోని మెడికల్ కళాశాల వద్ద చేపట్టనున్న కార్యక్రమంలో పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమరనాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమం ద్వారా మెడికల్ కళాశాలకు సంబంఽధించిన పూర్తి వాస్తవాలు ప్రజలకు వివరిస్తామన్నారు.
మానవ మనుగడకు
మార్గదర్శకుడు విశ్వకర్మ
● జయంతి వేడుకల్లో
జేసీ అభిషేక్ కుమార్
ప్రశాంతి నిలయం: మానవ మనుగడకు మార్గదర్శకుడు విశ్వకర్మ అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ అభిషేక్‌కుమార్ మాట్లాడుతూ, ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా ప్రవచనకారులు విశ్వకర్మను ప్రస్తావిస్తారన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని అధికారికంగా జరుపుతున్నాయన్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే విశ్వకర్మ ఉప సమూహాలైన కమ్మరి, వడ్రంగి, కాంస్య కమ్మరులు, శిల్పులు, స్వర్ణకారులు తదితర కులవృత్తుల వారికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘విశ్వకర్మ యోజన’ పథకం కింద రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోందన్నారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్‌రెడ్డి, డీఎస్‌డీఓ ఉదయభాస్కర్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రేపు వైఎస్సార్ సీపీ ‘చలో మెడికల్ కాలేజీ’