
బీజేపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
గోరంట్ల: ఓ కేసు విషయంలో గోరంట్ల సీఐ శేఖర్‌తో పాటు సిబ్బంది తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తూ గోరంట్లకు చెందిన దేవాంగం నరేష్ బుధవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదుటే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు నరేష్ తెలిపిన వివరాల మేరకు.. గోరంట్లకు చెందిన దేవాంగం నరేష్ బీజేపీ నాయకుడు. అతను ఓ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. దీంతో బుధవారం ఉదయం సీఐ శేఖర్ అతన్ని, అతని సోదరుడైన మహేష్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం సీఐ శేఖర్ ఆదేశాలతో ఇద్దరు కానిస్టేబుళ్లు అన్నదమ్ములిద్దరినీ చిత్రహింసలకు గురి చేశారు. అలాగే వారి కుటుంబీకులను అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపం చెందిన దేవాంగం నరేష్ సాయంత్రం పోలీసు స్టేషన్ ఎదుటే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన ఎస్‌ఐ రామచంద్ర, పోలీసులు అతన్ని నిలువరించి కాపాడారు. తాను తప్పుచేసి ఉంటే కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని, ఇలా థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం సీఐకి ఎవరిచ్చారని నరేష్ ప్రశ్నించారు.
రౌడీషీటర్లు.. ఇందుకే కౌన్సెలింగ్ ఇచ్చాం..
ఈ విషయమై సీఐ శేఖర్‌ను వివరణ కోరగా... నరేష్‌తో పాటు అతని సోదరుడు మహేష్‌పై గోరంట్ల పోలీసు స్టేషన్‌లో 2014లో రౌడీషీట్ ఓపెన్ అయ్యిందని, అదేవిధంగా 2025 జూన్ 17వ తేదీన ఆర్‌అండ్‌బీ ప్రహరీని జేసీబీలతో కూల్చిన కేసుతోపాటు అదేరోజు మరో కేసు కూడా నమోదైందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ఉన్నతాధికారుల అదేశాల మేరకే నరేన్‌తో పాటు అతని సోదరుడు మహేష్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించడంతో పాటు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన నరేష్‌పై తాజాగా మరోకేసు నమోదు చేశామన్నారు.
స్టేషన్ ఎదుటే ఒంటిపై
డీజిల్ పోసుకున్న బాధితుడు
సీఐ శేఖర్, పోలీసులు తనపై
థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన