
నూతన ఎస్పీ సతీష్ కుమార్
ఏడాదిన్నరగా జిల్లాలో అదుపు తప్పిన శాంతి భద్రతలు
విచ్చలవిడిగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు
వీధి వీధినా బెల్టు షాపులు.. ఏరులై పారుతోన్న మద్యం
పేకాట, లాటరీ, బెట్టింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు
అన్నీ తెలిసీ కళ్లుమూసుకున్న పోలీసు యంత్రాంగం
నూతన ఎస్పీ కట్టడి చేస్తారని ఆశపడుతున్న జనం
అత్యాచారాలు, అరాచకాలు.. భూకబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు... జూదం, గంజాయి అక్రమ రవాణా, హత్యలు... ఇలా నిత్యం శ్రీసత్యసాయి జిల్లా వార్తల్లో నిలుస్తోంది. కంచెలా సమాజానికి కాపుకాయాల్సిన ఖాకీల్లోనూ కొందరు దారి తప్పారు. కూటమి నేతల కనుసన్నల్లో పనిచేస్తూ జనానికి మరింత నరకం చూపుతున్నారు. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారంతా ఇటీవలే చార్జ్ తీసుకున్న కొత్త పోలీసు బాస్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆయనైనా లాఠీ ఎత్తూతారా.. లేదా అందరిలాగే లైట్ గా తీసుకుంటారా.. అన్న చర్చ సాగుతోంది.
కొత్త బాస్‌కు లెక్కలేనన్ని సవాళ్లు
జిల్లా నూతన పోలీస్ బాస్‌గా సతీష్ కుమార్ ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పనితీరు, చేసిన సంస్కరణల గురించి తెలుసుకున్న జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అదుపుతప్పిన శాంతిభద్రతలను కట్టడి చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
సాక్షి, పుట్టపర్తి: ఏడాదిన్నర కాలంగా జిల్లాలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఏ గ్రామంలో చూసినా ఏదో ఘటన వెలుగు చూస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారు. నాయకుల అండ చూసుకుని రౌడీ గ్యాంగ్‌లు తెరపైకి వచ్చాయి. ప్రజలకు అండగా నిలిచి భద్రత కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తుండటంతో పోలీస్ వ్యవస్థపైనా ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది.
మత్తు.. జీవితాలు చిత్తు..
జిల్లాలోకి గంజాయి విచ్చలవిడిగా దిగుమతి అవుతోంది. వీధివీధినా మద్యం ఏరులై పారుతోంది. అరికట్టేనాథుడే లేకపోవడంతో ఎంతోమంది యువత చిన్న వయసులోనే మద్యానికి, గంజాయికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు. జిల్లాలో జరిగిన చాలా భూ తగాదాలు, హత్యలు మద్యం మత్తులో చేసినట్లు తేలింది.
హిందూపురంలో అరాచకాల పర్వం..
నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు వెలుగు చూశాయి. పోలీసుల తీరును అలుసుగా తీసుకున్న ఓ వ్యక్తి పక్కా ప్లాన్‌తో తూమకుంట ఎస్‌బీఐలో భారీ చోరీ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లిలో ఇంట్లో ఉన్న అత్తా కోడలిపై కొందరు యువకులు గంజాయి మత్తులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత హిందూపురంలో ఓ వ్యక్తిని హత్య చేశారు. ఇటీవల చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై హత్యాయత్నం చేశారు. పుట్టపర్తిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఆఖరికి పోలీసుల వాహనాలు సైతం చోరీలకు గురవుతుండటం గమనార్హం. శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ క్వార్టర్స్‌లో ఏకకాలంలో 9 బ్లాకుల్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. అయినా పోలీసులు దొంగలను పట్టుకోలేకపోయారు.
రేషన్ మాఫియా కేరాఫ్ పెనుకొండ..
మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం రేషన్ బియ్యం మాఫియాకు కేరాఫ్‌గా నిలిచింది. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో సోమందేపల్లికి చెందిన తెలుగు తమ్ముడు రామకృష్ణ రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ దందా అందరికీ తెలిసినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
పోలీసుల తీరుపైనా విమర్శలు..
జిల్లాలోని ఏ ఒక్క పోలీస్ సబ్ డివిజన్‌లో కూడా శాంతి భద్రతలు అదుపులో లేవు. పైగా పోలీసుల తీరుపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మడకశిర సీఐ ఓ మహిళను వేధించిన కేసులో సస్పెండ్ అయ్యారు. అలాగే పట్నం ఎస్‌ఐ ఓ మహిళకు న్యూడ్ వీడియోకాల్స్ చేసి వేధించి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఇక సివిల్ పంచాయితీల్లోనూ తలదూరుస్తున్న పోలీసులు సెటిల్‌మెంట్లు చేస్తూ.. భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చాలా స్టేషన్‌లలో చోరీలు, హత్య కేసులు కూడా ఏడాదిగా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. బాధితులు మాత్రం రోజూ పోలీసుస్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల దందా..
మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణంలో వడ్డీ వ్యాపారులు.. పేదల రక్తం పీలుస్తున్నారు. వారానికి రూ.100కు రూ.పది చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. సకాలంలో వడ్డీ చెల్లించలేని వారిపై దాడులకు తెగబడుతున్నారు. వడ్డీ వ్యాపారులపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలోని ముదిగుబ్బ గంజాయి అక్రమ సరఫరాకు కేంద్రంగా మారిందని సమాచారం. ఇలా నియోజకవర్గంలోని పలు మండలాల్లో మద్యం మత్తులో విచ్చలవిడిగా గొడవలు, తగాదాలు, హత్యలు వెలుగు చూస్తున్నాయి.
రామగిరిలో రాక్షస క్రీడలు..
పరిటాల సునీత సొంత మండలం రామగిరిలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రజాప్రతినిధులకే భదత్ర లేకుండా పోయింది. ఎంపీపీ ఎన్నికల కోసం వెళ్తున్న ఓ మహిళా ఎంపీటీసీ సభ్యురాలిని పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేయడం కలకలం రేగింది. పేదల భూముల కబ్జాకు అంతేలేకుండా పోయింది. ఇక రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లి గ్రామంలో ఓ దళిత మైనర్ బాలికను కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడి సామూహిక అత్యాచారం చేశారు. బాలిక ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడా అమ్మాయి అనాథగా ప్రభుత్వ ఆశ్రయంలో ఉంది. టీడీపీ అల్లరి మూకలు సాగించిన ఈ అరాచకం చూసి సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకుంది. ఇక రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో లింగమయ్య హత్య రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రామగిరిలో దౌర్జన్యాలు, దుర్మార్గాలను అడ్డుకోవాల్సిన ఎస్‌ఐ... టీడీపీకి అంటకాగుతూ సామాన్యులపై తన ప్రతాపం చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి.

తూమకుంట ఎస్‌బీఐలో జరిగిన చోరీని పరిశీలిస్తున్నబ్యాంకు, పోలీసు అధికారులు (ఫైల్)