హిందూపురం: బొజ్జ గణపతి.. సకల విద్యల విఘ్నేశ్వరుడు.. శివపార్వతుల ముద్దుల తనయుడు... ఆదిపూజలస్వామి... ఏకదంతుడైన వినాయకుడి నిమజ్జనం గురువారం హిందూపురం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలో కొలువు దీరిన 138 వినాయక విగ్రహాలను గుడ్డం కోనేరులో నిమజ్జనం చేశారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచే..
గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే గణేశ్ మండపాల వద్ద కోలాహలం మొదలైంది. భారీ గణేశ్ విగ్రహాలను వాహనాల్లో కొలువుదీర్చి ప్రత్యేక పూజల తర్వాత శోభాయాత్రను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకూ నిమజ్జనోత్సవం సాగింది. అంతకుముందు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన వినాయకుల ప్రతిమలను ట్రాక్టర్లు, లారీలపై ముస్తాబు చేసి అంబేడ్కర్ సర్కిల్‌కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అటు నుంచి గాంధీసర్కిల్ గుండా విడి రోడ్డు మీదుగా పల్లా సర్కిల్ రైల్వేరోడ్డు నుంచి శ్రీనివాస మందిరం, రాజీవ్‌సర్కిల్‌ల గుండా ఎంజీఎం స్కూల్ నుంచి గుడ్డం కోనేరు చేర్చారు.
సందడే సందడి..
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా హిందూపురంలో సందడి వాతావరణం నెలకొంది. డీజే మ్యూజిక్, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల మధ్య యువకుల నృత్యాలతో హోరెత్తించారు. వివిధ వేఽషధారణలతో యువకులు ఆకట్టుకున్నారు. అడుగడుగునా దాతలు నీరు, మజ్జిగ, ప్రసాదాలను భక్తులకు అందించారు.
కట్టుదిట్టమైన బందోబస్తు..
పురంలో గణేశ్ నిమజ్జనోత్సం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ వి.రత్న, అదనపు ఎస్పీ, పర్యవేక్షణలో డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. పట్టణ ప్రధాన ప్రాంతాలతో పాటు గుడ్డం కోనేరు ఘాట్ వద్ద బందోబస్తులను పర్యవేక్షంచారు. సీఐలు రాజగోపాల్‌నాయుడు, అబ్దుల్ కరీం, ఆంజనేయులు, జనార్దన్‌లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంతరాలు లేకుండా నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయించారు.
విద్యుత్తు అంతరాయంపై అసహనం..
పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పట్టణమంతా అంధకారం నెలకొంది. జనరేటర్లు, యూపీఎస్‌లు ఉన్న చోట తప్ప ఎక్కడా విద్యుత్ కాంతులు లేవు. గురువారం అర్ధరాత్రి వరకూ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలేకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘పురం’లో అత్యంత వైభవంగా
వినాయక నిమజ్జనం
భక్తులతో కిక్కిరిసిపోయిన పట్టణం
డప్పు మోతలతో సందడే సందడి
తెల్లవారే వరకూ సాగిన కార్యక్రమం
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా
సాగడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై .. గణపతి బొప్పా మోరియా అంటూ
జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై .. గణపతి బొప్పా మోరియా అంటూ