
ఈ–క్రాప్ ఆధారంగానే యూరియా
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఈ–క్రాప్ నమోదు ఆధారంగా టోకెన్ పద్ధతిలో యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఎంత మేరకు పంటలు సాగు చేశారు. పంటల జాబితా , వాటికి అవసరమయ్యే యూరియా మోతాదును డివిజన్, మండల, రైతు సేవా కేంద్రాల వారీగా నమోదు చేయాలన్నారు. పంటలు సాగు చేసి యూరియా అవసరమున్న రైతులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు. డివిజనల్ స్థాయిలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పంటల వివరాల ఆధారంగా ఎరువుల పంపిణీపై సమీక్ష చేయాలని ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, మార్క్‌ఫెడ్ నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ రైతు సేవా కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా నిల్వల్లో తేడాలుంటే వెంటనే కేసులను నమోదు చేయాలన్నారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
జిల్లాలో యూరియా సరఫరాపై పర్యవేక్షణకు పుట్టపర్తిలోని జిల్లా ట్రైనింగ్ సెంటర్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సెల్ 9177768274, 9948224545 నంబర్లను సంప్రదించవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యనారాయణరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి రాము నాయక్, మార్క్‌ఫెడ్ డీఎం గీతా, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్