
యూరియా కొరతపై అన్నదాతల ఆగ్రహం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తి మండలం గాజులపల్లి చెరువు కింద వరి సాగు చేసే రైతులు, నిడిమామిడి పంచాయతీ రైతులు సుమారు 300 మందికి కేవలం 140 బస్తాలే సరఫరా చేయడంతో యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు నెల రోజుల నుంచి యూరియా లేక అల్లాడిపోతున్న రైతులకు ప్రభుత్వం నిడిమామిడి ఆర్‌ఎస్‌కేకు కేవలం 140 బస్తాలు సరఫరా చేయడంతో రెండు గంటల్లో స్టాక్ అయిపోయింది. తక్కిన రైతులు ఉసూరుమంటూ ప్రభుత్వంపై, వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగు ముఖం పట్టారు. చేతగాని ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. పక్కనే మరో మూడు పంచాయతీలు కొట్లపల్లి, ఇరగరాజుపల్లి, రాచువారిపల్లి ఉన్నాయి. సుమారు 1000 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వీరికి మొదటిసారి కేవలం 140 బస్తాలు యూరియా రావడంతో రైతులంతా ఉదయం నుంచే వేచి ఉన్నారు. యూరియా పంపిణీ ప్రారంభమైన కొద్ది సేపటికే స్టాక్ అయిపోయిందని చెప్పడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరియా కోసం ఆందోళన చేశారు. మూకుమ్మడిగా ఆర్‌ఎస్‌కేలోకి చొచ్చుకెల్లినా ఫలితం లేకపోయింది.
300 మంది 140 బస్తాలు
ఎలా సరిపోతాయని నిలదీత