
పోరాడదాం.. విజేతలుగా నిలుద్దాం
పుట్టపర్తి అర్బన్: ‘‘పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల నేతల దౌర్జన్యం, అరాచకం చూశాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారి వైఖరి అలాగే ఉంటుంది. ఏస్థాయికై నా దిగజారి రాజకీయం చేస్తారు. వారి అరాచకరాలను సమష్టిగా ఎదుర్కొందాం. గ్రామ గ్రామానా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడిద్దాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. బుధవారం పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉషశ్రీచరణ్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్, రమేష్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు మరోసారి తెలియజేసి పార్టీని గ్రామ/వార్డు స్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సమర్థవంతమైన నాయకులు వేలాది మంది ఉన్నారని, అందుకే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించామన్నారు. తొలుత ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’లో భాగంగా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మన పార్టీ నాయకులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారని, తిరిగి మనమే అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు జిల్లాలోని 7 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని కై వసం చేసుకోవాలన్నారు.
పనిచేసే వారికి సముచిత స్థానం
పార్టీకోసం కష్టపడే వారికి తప్పక సముచిత స్థానం కల్పించడంతో పాటు అండగా ఉంటామని ఉషశ్రీచరణ్, రమేష్‌రెడ్డి తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాలను బలోపేతం చేయడానికి జిల్లాలో తొలి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరి సలహా, సూచనలను కమిటీ తీసుకుంటుందన్నారు. వివిధ కమిటీల్లో స్థానం దక్కించుకున్న వారంతా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో గమనించిన ప్రతి అంశాన్ని జిల్లా కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి బూత్‌లోనూ బీఎల్‌ఏలను ఏర్పాటు చేసుకుని, ఆ జాబితాను ఆర్డీఓలకు పంపాలన్నారు. ఓటరు జాబితా, మార్పులు, చేర్పులు, పోలింగ్ బూత్‌ల మార్పు తదితర విషయాలన్నీ తెలుసుకోవాలన్నారు.
సోషల్ మీడియాను వాడుకుందాం
ప్రతి గ్రామంలోనూ మహిళా, రైతు, యువజన, సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను, కూటమి సర్కార్ అసమర్థ పాలన, అరాచకాలను ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరిద్దామన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డీఎస్ కేశవరెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లింగాల లోకేశ్వరరెడ్డి, కురుబ నాగిరెడ్డి, శేషురెడ్డి, సుధాకరరెడ్డి, జోనల్ ఇన్‌చార్జ్ గాజుల శ్వేతారెడ్డి, వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, మహిళా విభాగం రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీలారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సాయికుమార్, శివప్రసాద్, రఘురామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రణీత్‌రెడ్డి, సురేష్‌కుమార్, ప్రభాకరరెడ్డి, రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు అభిలాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవింద్‌నాయక్, వలంటీర్ విభాగం అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, చేనేత విభాగం అధ్యక్షుడు జింకా కంబగిరి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పురుషోత్తం, పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడు ఫకృద్దీన్, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు రమేష్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, ఐటీ విభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు గజ్జల శివ తదితరులు పాల్గొన్నారు.
పార్టీని గ్రామ స్థాయి నుంచి
మరింత బలోపేతం చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో
మన సత్తా చాటుదాం
కూటమి దౌర్జన్యాలు, దుర్మార్గాలను ఊరూరా వివరిద్దాం
పార్టీ శ్రేణులకు ఉషశ్రీ చరణ్,
రమేష్‌రెడ్డి పిలుపు
పుట్టపర్తిలో వైఎస్సార్ సీపీ వర్కింగ్ కమిటీ సభ్యులతో సమావేశం

పోరాడదాం.. విజేతలుగా నిలుద్దాం