
రైతుకోసం వైఎస్సార్ సీపీ పోరుబాటు
పుట్టపర్తి అర్బన్: రైతు కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ కూటమి సర్కార్ పాలనను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన ధర్నాకు సిద్ధమైంది. రైతుల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, రైతు సంక్షేమాన్ని కాంక్షించే వారంతా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్‌రెడ్డితో కలిసి పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి నేతలు మామిడి రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించలేకపోయారన్నారు. ఉల్లి రైతులకు కంట కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. ఇక విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో రైతులకు అందించలేకపోయారన్నారు. అందువల్లే ఈ సీజన్‌లో జిల్లాలో కేవలం 63 శాతం మంది రైతులే పంటలు సాగు చేశారన్నారు. రైతులకు జీవనాధారమైన వరి సాగు చేయవద్దని ప్రకటించడం కూటమి ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. కీలకమైన సమయంలో యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. పంట నష్ట పరిహారం, ఉచిత బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ గత ఏడాది అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయలేక పోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9వ తేదీ మంగళవారం జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. వైఎస్ జగన్ సర్కార్ రైతును రాజు చేస్తే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలను నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కన్వీనర్లు, కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
యూరియా కొరతపై 9న
ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నా
రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపు