
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ధర్మవరం అర్బన్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. శుక్రవారం ఆయన ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని రికార్డుల నిర్వహణ, మందుల స్టాకు, శుభ్రత, సిబ్బంది హాజరు తదితర వివరాలను ఆరా తీశారు. వైద్య సేవల గురించి అక్కడున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్యసేవ సెంటర్‌ను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలిచ్చారు. ఆస్పత్రి ఆవరణతో పాటు వార్డులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఓపీ విభాగం మరింత విశాలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
యూరియాను అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు
ప్రశాంతి నిలయం: యూరియాను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా రైతుల అవసరాల మేరకు యూరియా అందుబాటులో ఉందన్నారు. యూరియాను అక్రమ నిల్వలు చేసే వారిపై నిఘా ఉంచామన్నారు. ఎవరైనా అధిక ధరకు యూరియాను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ ( పీఎం కుసుమ్) పథకం కింద సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు అవసరమైన భూమిని వెంటనే గుర్తించి సోమవారంలోపు నివేదికలను అందజేయాలని ఆర్డీఓలను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, వ్యవసాయ శాఖ జేడీ సుబ్బారావు, తహసీల్దార్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
అర్హులైన వారందరికీ పింఛన్లు
అర్హులైన వారందరికీ సెప్టెంబర్ 1న పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 36,793 పింఛన్లు ఉండగా, అందులో దివ్యాంగుల పింఛన్లు 35,078, హెల్త్ పింఛన్లు 1,715 ఉన్నాయన్నారు. వీటిలో 27,527 పింఛన్లు పునఃపరిశీలన పూర్తయ్యిందని, 7,163 మందికి వివిధ కారణాలతో పింఛన్‌కు అర్హత కోల్పోయినట్లు తేలిందన్నారు. అనర్హతకు గురైన వారందరూ మళ్లీ అప్పీల్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించిందన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ల లాగిన్ ద్వారా ఈ నెల 31వ తేదీ వరకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇలా అప్పీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ 1న పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే వారంతా పునఃపరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
వైద్యులకు కలెక్టర్ చేతన్ ఆదేశం
ధర్మవరం ఏరియా ఆస్పత్రి తనిఖీ