
ఎన్‌టీఆర్ ‘వసూళ్ల’ సేవ!
● సోమందేపల్లికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి గుండె సమస్యతో హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ సిబ్బంది పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని.. అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఉచితంగా వైద్యం చేస్తారని సూచించారు. అక్కడికి వెళ్లగా.. టోకెన్ ఫీజు తీసుకుని.. బెడ్ ఇచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం ఎన్టీఆర్ వైద్య సేవ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్రూవల్ మెసేజీ వచ్చే లోపు రూ.20 వేలు తీసుకున్నారు. పూర్తిగా ఉచితం కదా అని ప్రశ్నిస్తే.. అనుమతులు రాక ముందే చార్జీలు అంటూ సమాధానం చెప్పారు. అంతేకాకుండా ఆపరేషన్ చేసే సమయంలో పేషెంట్ కండిషన్ బాగా లేకుంటే బెంగళూరు వెళ్లాలని భయపెట్టారు. ఒకవేళ దూరం వెళ్లలేకుంటే మరో రూ.30 వేలు అదనంగా చెల్లిస్తే.. స్పెషలిస్టును పిలిపిస్తామని వసూలు చేసినట్లు బాధితులు వాపోయారు.
● ఓడీ చెరువుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి కదిరి రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వెంటనే ప్రథమ చికిత్స చేసి రూ.10 వేలు కట్టించుకున్నారు. ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ గురించి అడిగితే.. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వర్తిస్తుందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజుల వరకు మెడిసిన్, బెడ్ ఫీజు చెల్లించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వర్తిస్తుందని మెసేజీ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పారు. కొన్ని గంటల ముందుగా రోగి కుటుంబ సభ్యులతో డాక్టర్లు మాట్లాడి.. ప్రభుత్వం ఇచ్చే మొత్తం సరిపోదని.. ఇంకొంత చెల్లిస్తే ఆపరేషన్ చేస్తామని.. లేదంటే వేరే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో అదనంగా మరో రూ.15 వేలు చెల్లించినట్లు బాధితులు వాపోయారు.
... చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ విధంగానే దందా చేస్తున్నారు. అయితే పట్టించుకోవాల్సిన అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు.
సాక్షి, పుట్టపర్తి : పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ‘ఎన్‌టీఆర్ వైద్య సేవ’ పథకంలోని కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీశాయి. రోగుల భయాన్ని, ఆరోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నాయి. ప్రభుత్వం అందించే నిధులు ఏ మూలకూ సరిపోవంటూ నమ్మబలికి కో–పేమెంట్లతో దండుకుంటున్నారు. మల్టీ స్పెషాలిటీ సేవలతో పాటు ఆర్థో, యూరో, కార్డియాక్ చికిత్స చేసే ఆస్పత్రుల్లో ఇలాంటి వ్యవహారాలు బయట పడుతున్నాయి.
భయపెట్టి వసూళ్లు..
అదనపు వసూళ్ల విషయంలో బయటకు చెబితే.. మెరుగైన వైద్యం అందించరేమోననే భయంతో రోగులు మిన్నకుండిపోతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిపోయింది. కంటి, న్యూరో, ఆర్థో, యూరాలజీ, కార్డియాక్.. ఇలా ఏ శస్త్రచికిత్స అయినా.. స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా మరింత డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్పటికప్పుడు అప్పు తెచ్చి మరీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వసూలు చేస్తున్నారు ఇలా..
ఎన్టీఆర్ వైద్యసేవలో ఓ వ్యక్తి సింగిల్ స్టంట్ వేయించుకోవాలంటే రూ.60 వేలు, డబుల్ స్టంట్‌కు అయితే రూ.90 వేలు చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. రోగి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయి. కొందరు తెలియక.. నేరుగా ఆస్పత్రికి వెళ్తుండటంతో.. టోకెన్ ఫీజుతో పాటు బెడ్ చార్జీలు, ముందస్తు మెడిసిన్ పేరుతో రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఇంకా అప్రూవల్ మెసేజీ రాలేదంటే నాలుగైదు రోజులు గడిపేసి భారీగా లాగేసి ఆ తర్వాత ఆపరేషన్ కోసం మరోసారి ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవలు అందుబాటులో ఉండే ఆస్పత్రులు 11 (హిందూపురంలో 5, కదిరిలో 4, ధర్మవరంలో 2) ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వాస్పత్రికి వెళ్లినా.. ఆయా ఆస్పత్రులకు వెళ్లాలని కొందరు సూచించి అదనపు వసూలులో పర్సెంటేజీలు తీసుకున్నట్లు సమాచారం. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రమైంది.
అమలు అస్తవ్యస్తం..
ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు అస్తవ్యస్తంగా ఉంది. వైద్యసేవలు అందుబాటులో ఉంటున్న ఆస్పత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఆరోగ్య మిత్రలు అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆ తర్వాత చేరిన రోగులు టోకెన్ తీసుకుని.. మరుసటి రోజు వరకు ఫీజులు చెల్లించి.. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి.
వైద్యసేవల్లో సరికొత్త దందా
ఉచితం మాటున ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ
అనుమతులు వచ్చేలోపే జేబులు గుళ్ల చేస్తున్న వైనం
కూటమి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వైద్యం