
పారని టీడీపీ పాచిక
చిలమత్తూరు: పురం వైస్ చైర్మన్ అవిశ్వాసంలో టీడీపీ పాచిక పారలేదు. తగిన బలం లేకపోయినా చైర్మన్ పీఠం లాగే, వైస్ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుందామనుకున్న టీడీపీ నేతలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి ఒక్కరంటే ఒక్క కౌన్సిలర్ కూడా హాజరుకాకపోవడంతో ఆర్డీఓ సమావేశం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఒక్కరూ రాలేదు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. సరైన బలం లేకపోయినా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకునేందుకు అవిశ్వాస తీర్మాణం పెడుతోంది. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను ప్రలోబాలకు గురిచేసి, అధికారంతో భయపెట్టి తమవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే హిందూపురం చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. తాజాగా వైస్ చైర్మన్‌గా ఉన్న జబీవుల్లాను తప్పించి ఆ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే సోమవారం ఆర్డీఓ సమక్షంలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని అధికారులతో ఏర్పాటు చేయించింది. వైస్ చైర్మన్‌పై అవిశ్వాసానికి 27 మంది మద్దతు తెలపాల్సి ఉండగా..ఉదయం 11 గంటలకు సభ్యులు ఎవ్వరూ హాజరు కాకపోవడంతో ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ ఆనంద్ కుమార్ సమావేశాన్ని 12 గంటలకు వాయిదా వేశారు. ఆ సమయానికి కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరు కాకపోవడంతో మినిట్స్ నమోదు చేసిన ఆర్డీఓ విషయాన్ని కలెక్టర్‌కు సమాచారం అందించి వెళ్లిపోయారు.
వ్యూహాత్మకంగా వ్యవహరించిన వైఎస్సార్ సీపీ..
వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్ సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమ పార్టీ సభ్యులు సమావేశానికి వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో చతికిలపడ్డ చైర్మన్ రమేష్, టీడీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయానికే పరిమితమయ్యారు. టీడీపీ కుటిల బుద్ధితో అక్రమ మార్గాలలో వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూడటంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేశారు. కాగా సమావేశం నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘పురం’ వైస్ చైర్మన్ పీఠం కోసం
దిగజారుడు రాజకీయం
బలం లేకపోయినా అవిశ్వాసం
నోటీసు ఇచ్చిన టీడీపీ నేతలు
అవిశ్వాస తీర్మానానికి సభ్యులంతా గైర్హాజరు
కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి
వెనుదిరిగిన ఆర్డీఓ

పారని టీడీపీ పాచిక