
ఉన్నతాధికారులు వేధిస్తున్నారు
పుట్టపర్తి టౌన్: పైస్థాయి ఉద్యోగుల వేధింపులు తాళలేకపోతున్నానంటూ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కన్నీటి పర్యంతమైంది. వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ సోమవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ రత్నను కలసి విన్నవించుకుంది. వివరాలు... లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన ప్రభావతి హిందూపురంలోని ఆర్టీసీ డిపోలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో అదే డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు డి.వి.నారాయణ, భరత్‌కుమార్‌రెడ్డి, జీవీ రమణ తరచూ ఆమెను లైగింక వేధింపులకు గురి చేస్తూ వస్తున్నారు. వారి కోరిక తీర్చకపోవడంతో ఉద్యోగ పరంగా ఇబ్బందులు పెట్టసాగారు. ఈ విషయంపై గతంలో హిందూపురం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. విచారణ పేరుతో కాలయాపన చేసిన పోలీసులు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల ఒత్తిళ్లకు తలొగ్గి కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. చివరకు వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తనను కాపాడాలంటూ బాధితురాలు సోమవారం ఎస్పీని కలసి వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ రత్న వెంటనే హిందూపురం డీఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి.. బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సీఐ సురేస్ పాల్గొన్నారు.
న్యాయం చేయాలని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వేడుకోలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీకి వినతి