
అన్నదాతలకు వ్యథ
వ్యవసాయం భారం
తలుపుల: వ్యవసాయ రంగాన్ని రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తున్నది. సేద్యంలో రైతులపై పెట్టుబడుల భారం పెరిగిపోతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా పొలం పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలన్న నీతి అయోగ్ ఆలోచన ఎనిమిదేండ్లు అవుతున్నా నేటికీ ఆచరణకు నోచుకోలేక పోతోంది. దీంతో కూలీల కొరత కారణంగా పంటల సాగు వ్యయం పెరిగి.. వ్యవసాయం భారమవుతోంది.
కూలీల కొరత తీవ్రం..
కూలీలు ఎక్కువగా ఉపాధి పనులకు పోతుండడంతో వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో వ్యవసాయ పనులు సకాలంలో పూర్తి చేయలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 2,69,152 హెక్టార్లలో సాగు భూమి ఉండగా... వేరుశనగ, వరి, మొక్కజొన్న, మిరప,బొప్పాయి, కర్బూజా, టమాటా తదితర పంటలు సాగుచేస్తున్నారు. సాధారణగా ఖరీఫ్ సీజన్‌లో వరి సాగుకు ఎకరాకు రూ.25 వేలు ఖర్చు అవుతుంది. అలాగే మొక్కజొన్న, మిరప, వేరుశనగ తదితర పంటలకూ అంతే మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని రైతులు అంటున్నారు. వ్యవసాయ పనులకు వచ్చే వారికి భోజనంతో పాటు రోజుకి ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తామన్నా.. కూలీలు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం పనుల వైపే కూలీలు మొగ్గు చూపుతుండడంతో వ్యవసాయ పనులకు కొరత ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల కొరత తీరడంతో పాటు రైతులకు ఆర్థిక ప్రయోజనాలూ చేకూరుతాయని మేధావులు అంటున్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని రైతులూ కోరుతున్నారు.
జిల్లా సమాచారం...
జిల్లాలో సాగుభూముల విస్తీర్ణం :
2,69,152 హెక్టార్లు
ప్రధానంగా సాగు చేసే పంటలు :
వేరుశనగ, వరి, మామిడి, ఉలవ, టమాట తదితర పంటలు
ఉపాధి కూలీల సంఖ్య : 55,857