
వైభవంగా వసంతోత్సవం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వసంతోత్సవం నిర్వహించారు. శ్రీవారు పదోరోజు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, వసంతోత్సవం, కంకణ విసర్జన, చక్రస్నానం, మహా మంగళహారతి తదితర పూజలు చేశారు. ఉదయం ఆలయం వద్ద నుంచి లక్ష్మీబజారు వరకు వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం సాయంత్రం మయూర వాహనంపై దేవేరులతో శ్రీవారిని ప్రత్యేక రథంపై ఆశీనులు చేసి పురవీధుల్లో ఊరేగించారు. విశ్వ హిందూ పరిషత్, రజక సంఘం, హరిజన, మాల, హట్కారి కెత్తర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మయూర వాహన సేవ కొనసాగింది. చివరి రోజు మంగళవారం సప్తప్రాకారోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు.