
కోల్డ్‌స్టోరేజ్‌లో కుళ్లిన బ్యాడిగ మిర్చి
కూడేరు: కర్ణాటక రాష్ట్రం బ్యాడిగికి చెందిన కోల్డ్‌స్టోరేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో రైతు మల్లికార్జున నష్టపోయాడు. ఇప్పేరుకు చెందిన రైతు మల్లికార్జున సోమవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఎకరాల్లో రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి బ్యాడిగ మిర్చి సాగు చేశానన్నారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక ఏప్రిల్ నెలలో బ్యాడిగిలో కోల్డ్ స్టోరేజ్‌లో 60 క్వింటాళ్ల మిర్చిని నిల్వ ఉంచానన్నాడు. క్వింటా రూ.15 వేలు వరకు ధర ఉండడంతో రెండు రోజులు క్రితం కోల్డ్ స్టోరేజ్‌కు వెళ్లి విక్రయించేందుకు వెళ్తే నిల్వ ఉంచిన మిర్చి కుళ్లిపోయిందన్నారు. సరుకు నాణ్యతగా లేకపోవడంతో క్వింటా రూ.4 వేలుతో వ్యాపారులు అడుగుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.9 లక్షలు వరకు వచ్చేదని, కోల్డ్‌స్టోరేజ్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోయానని రైతు వాపోయాడు.