దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవండి
చిలమత్తూరు: ‘‘ఏదైనా పదవి కావాలంటే ప్రజాభిమానంతో దక్కించుకోవాలి. కానీ ఇలా దిగజారి ప్రవర్తించకూడదు. మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో గెలవండి..ఇలా ఒక పార్టీపై గెలిచిన వారిని లాక్కుని వారి ద్వారా పదవులు పొందడం ఏమిటి’’ అంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. సోమవారం ఆమె హిందూపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కౌన్సిలర్లు, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలకు పదవులపై ఇంత పిచ్చి ప్రేమ దేనికని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడం మాని... ప్రజాస్వామ్యబద్ధంగా పొందిన పదవులను నిస్సిగ్గుగా దక్కించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పట్టణంలో అభివృద్ధి చూడకుండా నీచమైన పనులకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ పీఠం దక్కించుకున్నామని... ఇప్పుడు వైస్ చైర్మన్ పదవి కూడా దక్కించుకోవాలని చూస్తే తమ ప్రణాళికలు తమకు ఉంటాయన్నారు. తమ పార్టీ కౌన్సిలర్లు కొందరు ప్రలోభాలకు లొంగిపోయారని, కానీ అందరూ అలా ఉండరన్న విషయం ఇప్పటికై నా ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్తించాలన్నారు. తమ పార్టీలో నిజాయితీ పరులు ఉన్నారన్నారు. ప్రజల అండ, ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండ ఉంది కాబట్టే ఈరోజు టీడీపీ కుట్రలనుతిప్పి కొట్టామని వైస్ చైర్మన్ జబీవుల్లా భావోద్వేగంగా మాట్లాడారు. పదవులు తమకు లెక్కకాదని, కానీ టీడీపీ నేతలు తీసుకున్నట్లుగా దొడ్డిదారిలో వచ్చే పదవులు తనకొద్దన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ జబీవుల్లా, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వెంకట నాగేంద్రబాబు, షాజియా, గుడ్డం దాదు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కవితారెడ్డి, అబ్దుల్‌సలాం, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బలం లేకపోయినా వైస్ చైర్మన్‌పై
అవిశ్వాసం ఎలా పెడతారు
ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతల తీరుపై టీఎన్ దీపిక మండిపాటు


