
దైవదర్శనానికి వెళ్తూ..పరలోకాలకు
బత్తలపల్లి/కళ్యాణదుర్గం రూరల్: కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దైవదర్శనం కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బత్తలపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాజుల రామ్మోహన్ తన కుటుంబంతో పాటు స్నేహితుడు రాజశేఖర్‌రెడ్డి (45) కుటుంబ సభ్యులు, ముక్తాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్‌రెడ్డి (25) మొత్తం పదిమంది కళ్యాణదుర్గం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కారులో బయల్దేరారు. బత్తలపల్లి సమీపంలోని వై జంక్షన్ వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న రామ్మోహన్ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు బోల్తా పడింది. రామ్మోహన్, అతని భార్య మాధవి, కుమార్తెలు సాన్విక, జత్విక, కౌటిల్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి, అతని భార్య దీపిక, కుమారుడు యస్విత్‌రెడ్డి (7), కుమార్తె వీరాధ్యతో పాటు స్నేహితుడు ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్‌రెడ్డి, యస్విత్‌రెడ్డి మృతి చెందారు. ప్రశాంత్ కుమార్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రమేష్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య సానుభూతి తెలిపారు.

దైవదర్శనానికి వెళ్తూ..పరలోకాలకు

దైవదర్శనానికి వెళ్తూ..పరలోకాలకు

దైవదర్శనానికి వెళ్తూ..పరలోకాలకు