పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కళాజాత బృందాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం పేర్కొన్నారు. గురువారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద కళాజాత బృందాల కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. డీఎల్‌ఏటీఓ డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ జిల్లాలో గురువారం నుంచి 29 వరకూ సుమారు 20 రోజుల పాటు వీధి నాటకాలు ఏర్పాటు చేసి ఎయిడ్స్, హెచ్‌ఐవీపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా కొత్తచెరువు నెహ్రూ కూడలిలో కళాజాత బృందం నాటకాన్ని ప్రదర్శించింది.
ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు
గుడిబండ: మండల పరిధిలోని కొంకల్లు గ్రామంలో కారేళప్ప అనే వ్యక్తి ఎలుగు బంటి దాడిలో గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే .. గురువారం ఉదయం కారేళప్ప బహిర్భూమి కోసం బయటకు వెళ్లాడు. అటవీ ప్రాంతంలో నుంచి ఆహారం వెతుక్కుంటూ ఓ ఎలుగుబంటి ఊరి వైపు వచ్చింది. ఈ సమయంలోనే కారేళప్పపై ఎలుగుబంటి దాడి చేసింది. వెంటనే కారేళప్ప కేకలు వేయడంతో ఎలుగుబంటి అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసింది. గాయపడిన కారేళప్పను కుటుంబ సభ్యులు గుడిబండ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు.
రూ.5 లక్షలు ఇవ్వు .. లేదా ఊరు విడిచి వెళ్లిపో
● కిరాణా వ్యాపారిని బెదిరించిన బీజేపీ నాయకులు
ధర్మవరం అర్బన్: ‘‘మాకు రూ.5 లక్షలు ఇవ్వాలి. లేకపోతే ఈ ఊరు విడిచి వెళ్లిపోవాలి’’ అంటూ ఓ కిరాణా వ్యాపారిని బెదిరించిన బీజేపీ నేతలు... చివరకు కిరాణా షాపులోకి చొరబడి రూ.3 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గురువారం ధర్మవరంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని సాయినగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి వెంకటరమణ దుకాణం వద్దకు గురువారం బీజేపీ నాయకుడు సీసీ కొత్తకోట రవీంద్రరెడ్డి అనుచరులు భాస్కర్‌రెడ్డి, లచ్చి వచ్చారు. తమకు రూ.5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇదే సమయంలో సీసీ కొత్తకోట రవీంద్రరెడ్డి కూడా ఫోన్ చేసి వ్యాపారిని బెదిరించారు. అయినా వ్యాపారి లెక్కచేయకపోవడంతో భాస్కర్‌రెడ్డి, లచ్చి... కిరాణ దుకాణంలో చొరబడి రూ.3 వేల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు వెంకటరమణ ధర్మవరం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బీజీపీ నాయకుడు సీసీ కొత్తకోట రవీంద్రరెడ్డి, అతని అనుచరులు భాస్కర్‌రెడ్డి, లచ్చిలపై కేసు నమోదు చేశామని వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
పనులు సత్వరమే పూర్తి చేయండి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎన్ హెచ్ 342, ఎన్‌హెచ్ 716జీ జాతీయ రహదారులు, భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధితశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నాటికి జాతీయ రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓలు సువర్ణ, శర్మ, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పనులు సత్వరమే పూర్తి చేయండి

ఎయిడ్స్ నియంత్రణకు కళాజాత బృందాలు