సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
పుట్టపర్తి టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రమయంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజర్ (ఏఎస్‌ఎల్) ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న అధికారులకు ఆదేశించారు. గురువారం స్థానిక విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం వజ్రకరూరు మండలం ఛాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వెడల్పు పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించేందుకు సీఎం వస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 10.50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారన్నారు. విమానాశ్రయం నుంచి 10.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉరవకొండకు బయలుదేరి వెళ్తారని తెలిపారు. పర్యటన ముగించుకొని తిరిగి సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు బెంగళూరు విమానాశ్రయం చేరుకుంటారన్నారు. భద్రత విషయంలో లోటుపాట్లు లేకుండా అధికారులందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. డీఎస్పీలు విజయకుమార్, నరశింగప్ప, శివన్నారాయణస్వామి, ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్, ఆర్‌ఐలు మహేష్, వలితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పుట్టపర్తిలో ట్రాఫిక్ ఆంక్షలు..
సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కదిరి, ముదిగుబ్బ నుంచి వచ్చే వాహనాలు కర్ణాటక నాగేపల్లి, గణేష్ సర్కిల్ నుంచి బ్రాహ్మణపల్లి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీదుగా ,అలాగే కమ్మవారిపల్లి నుంచి వచ్చే వాహనాలు బైపాస్ మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తచెరువు,గోరంట్ల మీదుగా వచ్చే వాహనాలు మామిళ్లకుంట క్రాస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బీడుపల్లి, క్రాస్, బ్రాహ్మణపల్లి, ఎనుములపల్లి చిత్రా వతి బైపాస్ మీదుగా వాహనాలు మళ్లించనున్నారు.


