రెడ్డెప్పశెట్టికి ఉద్యాన ఉచ్చు
చిలమత్తూరు: ప్రభుత్వ భూములు, ప్రకృతి వనరులను దోచుకుంటూ రూ.కోట్లు ఆర్జించిన రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండగా...ఉద్యాన శాఖ అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా పాలీహౌస్‌లు, కమ్యూనిటీ ఫారంపాండ్లు నిర్మాణాలతో పాటు ఏకంగా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన అంశంపై ‘అక్రమాలు కోకొల్లలు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో ఉద్యానశాఖ అధికారులు స్పందించి విచారణ వేగవంతం చేశారు. రెడ్డెప్పశెట్టి ప్రభుత్వ భూములు, ఈడీ అటాచ్‌మెంట్ భూముల్లోనే పాలీహౌస్‌లు, కమ్యూనిటీ ఫారంపాండ్లు నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. రైతులకు లీజు హక్కు ఇవ్వడం ద్వారా సబ్సిడీలు పొందవచ్చన్న నిబంధనను అడ్డం పెట్టుకుని తన బినామీలకు లీజు హక్కు ఇచ్చి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీలను పొందినట్టు అధికారులు గుర్తించారు. ఉద్యానశాఖ మంజూరు చేసిన కమ్యూనిటీ ఫారంపాండ్‌ను సైతం రెడ్డెప్పశెట్టి ప్రభుత్వ భూమిలో నిర్మించి సొంతానికి వాడుకుంటున్నారు. కమ్యూనిటీ ఫారంపాండ్ ఉద్దేశాన్ని పక్కనపెట్టి లబ్ధి పొందినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమను మోసం చేసి ప్రజాధనం లూటీ చేసిన రెడ్డెప్పశెట్టికి ఉచ్చు బిగించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గతంలో కేసు నమోదైనా...
ఎల్లయ్య, పుల్లయ్య అంటూ స్థానికంగా లేని రైతుల పేర్లతో రెడ్డెప్పశెట్టి రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినట్టుగా గతంలోనే అధికారులు గుర్తించారు. రైతులను మోసం చేసి డ్రిప్ ఇరిగేషన్ మెటీరియల్‌లోనూ సబ్సిడీలు పొందిన ఆయనపై కేసు నమోదు చేశారు. అయినా ఉద్యాన శాఖ అధికారులు రూ.కోట్ల సబ్సిడీలు ఎలా ఇచ్చారన్న విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని మోసం చేసి సబ్సిడీ పేరుతో పొందిన కోట్లాది రూపాయలను రికవరీ చేయడంతో పాటు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెడ్డెప్పశెట్టి అవినీతి అక్రమాల్లో ఆయన ఎస్టేట్ సమీపంలోని ఓ గ్రామంలోని ఇద్దరి రియల్టర్ల పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా కూడా అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
బినామీలు, బంధువుల పేరిట ఉద్యానశాఖ నుంచి సబ్సిడీలు
ఒక సర్వే నంబరుతో దరఖాస్తు..
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు
సబ్సిడీ డ్రిప్ మంజూరు అవకతవకల్లో గతంలోనే రెడ్డెప్పశెట్టిపై కేసు


