కమ్ముకుంటున్న చీకట్లు! | - | Sakshi
Sakshi News home page

కమ్ముకుంటున్న చీకట్లు!

May 5 2025 8:56 AM | Updated on May 5 2025 8:56 AM

కమ్ము

కమ్ముకుంటున్న చీకట్లు!

చిన్నప్పటి నుంచి అందరితో పాటు ఎంతో ఉల్లాసంగా ఆటపాటలతో గడిపింది. 8వ తరగతి చదువుతుండగా ఒక్కసారిగా కంటి చూపు మందగించింది. ఏమి జరిగిందో ఏమో తెలుసుకునేలోపు ఓ కన్ను పూర్తిగా కనపడకుండా పోయింది. మరో కన్ను సైతం మసకబారింది. శస్త్ర చికిత్స చేస్తే కంటి చూపు వస్తుందని, లేకపోతే శాశ్వతంగా కంటి చూపు దూరమవుతుందని వైద్యులు నిర్ధారించారు. విషయం విన్న వెంటనే నిరుపేద తల్లిదండ్రులకు దిక్కు తోచలేదు. కుమార్తెకు కంటి చూపు ప్రసాదించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

నల్లచెరువు: మండలంలోని ఉప్పార్లపల్లి గ్రామానికి చెందిన ప్రభాకరరెడ్డి, అమరావతి దంపతులకు కుమార్తె రేష్విత, కుమారుడు పునీత్‌రెడ్డి ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చలాకీగా ఉండే రేష్విత స్థానిక ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంది పదో తరగతి వరకు చదువుకుంది.

బోర్డుపై అక్షరాలు కనిపించక..

ఎనిమిదో తరగతిలోకి వచ్చేసరికి కంటి చూపు సక్రమంగా లేదని రేష్విత గుర్తించింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపితే వారు స్థానికంగా ఉన్న డాక్టర్ల వద్ద చికిత్స చేయించారు. అయినా ఫలితం అంతంత మాత్రమే. ఈ క్రమంలో కొన్ని నెలల వ్యవధిలోనే బోర్డుపై అక్షరాలు కనిపించక ఇబ్బంది పడుతూ వచ్చింది. మరి కొన్నిరోజుల్లోనే ఓ కన్ను పూర్తిగా కనిపించకుండా పోయింది. మసకబారుతున్న మరో కంటితోనే అతి కష్టం మీద చదవడం.. దినచర్యను కొనసాగిస్తూ వచ్చింది. ఏడాది క్రితం నడుచుకుంటూ వెళ్లే సమయంలో రహదారి సక్రమంగా కనిపించక అదుపు తప్పి కిందపడడంతో తొడ భాగంలోని ఎముక విరిగి పొట్టలో గుచ్చుకుంది. తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పిస్తే.. ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అప్పటికప్పుడు తెలిసిన వారి వద్ద అప్పు చేసి రూ.2 లక్షల ఖర్చుతో ఆపరేషన్‌ చేయించారు. అయితే ఇప్పటికీ పూర్తిస్థాయిలో నడవలేకపోతోంది. తాను కంటి చూపు కోల్పోతున్నానని తెలుసుకున్న రేష్వితలో పట్టుదల పెరిగింది. కేవలం చదువు ఒక్కటే తన జీవన గమనాన్ని మారుస్తుందని భావించిన ఆమె అరకొరగా కనిపిస్తున్న కంటికి పది సెంటీమీటర్ల దూరంలో పుస్తకరాన్ని ఉంచుకుని అక్షరమక్షరం చదివి ఆకళింపు చేసుకుంది. ఈ నేపథ్యంలో కంటిపై ఒత్తిడి పెరుగుతున్నా.. శస్త్రచికిత్స చేసిన కాలి నొప్పి బాధిస్తున్నా పంటి బిగువనే ఓర్చుకుంది. పట్టుదలతో చదువుకుని మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో తెలుగు–92, హిందీ–64, ఇంగ్లిష్‌–81, సైన్స్‌–70, సోషల్‌–63 మార్కులు వచ్చాయి. అయితే కంటి చూపు సహకరించకపోవడంతో గణితం పరీక్ష సక్రమంగా రాయలేకపోయానని, దీంతో లెక్కల పరీక్ష ఫెయిల్‌ కావడం తననెంతో బాధించిందంటూ రేష్విత కన్నీటి పర్యంతమవుతోంది.

కళ్ల మార్పిడితోనే ఫలితం

క్రమంగా కంటి చూపు కోల్పోతున్న రేష్వితను పిలుచుకుని తల్లిదండ్రులు కదిరి, అనంతపురం, బెంగళూరు, తిరుపతి, మదనపల్లి, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అప్పులు చేసి రూ.2 లక్షల వరకూ ఖర్చు పెట్టారు. డాక్టర్లు ఇచ్చిన మందులు, ఐ డ్రాప్స్‌ సంవత్సరాలుగా వాడినా ఫలితం దక్కలేదు. రోజురోజుకూ కంటి చూపు తగ్గడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇక అప్పులు ఇచ్చే వారు కూడా లేకపోవడంతో దిక్కుతోచని తల్లిదండ్రులు తమ కంటి ముందే తారట్లాడుతూ నడుస్తున్న కుమార్తెను చూసి తల్లడిల్లిపోతున్నారు. అయితే కళ్ల (కార్నియా) మార్పిడితోనే రేష్వితకు కంటి చూపువస్తుందని వైద్యులు అంటున్నారు. అయితే 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఈ చికిత్సకు సంబంధించి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, రేష్వితకు కళ్ల మార్పిడి చేయాలంటే రూ.2 లక్షలు ఖర్చు వస్తుందని, ఈ మొత్తాన్ని తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో నిరుపేద తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు. ప్రస్తుతం సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో వ్యవసాయానికి ఖర్చులు పెరిగి అప్పుల పాలయ్యామని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డకు కంటి చూపు ప్రసాదించాలని వేడుకుంటున్నారు.

పట్టుమని 15 ఏళ్లకే కంటి చూపు దూరం

ఆపరేషన్‌ చేస్తే ఫలితం ఉంటుందన్న వైద్యులు

శస్త్రచికిత్సకు రూ.2 లక్షలు అవసరం

చేతిలో చిల్లిగవ్వ లేక విలవిల్లాడుతున్న నిరుపేద కుటుంబం

దాతలు సాయం చేయాలని వేడుకోలు

కమ్ముకుంటున్న చీకట్లు! 1
1/1

కమ్ముకుంటున్న చీకట్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement