తొలి సంతకం ఏమైంది బాబూ? | - | Sakshi
Sakshi News home page

తొలి సంతకం ఏమైంది బాబూ?

Mar 19 2025 1:50 AM | Updated on Mar 19 2025 1:48 AM

పరిగి: ‘‘ఎన్నికల వేళ బాబు వస్తే జాబు వస్తుందని గొప్పలు చెప్పారు. అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు పీకేశారు. తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్‌పైనే అంటూ ఆర్భాటంగా ప్రకటించారు..అధికారం చేపట్టి 9 నెలలు దాటినా ఇంతవరకూ నోటిఫికేషన్‌ లేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌..అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. నేటికీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మోసం చేశారు’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆమె.. మండలంలోని శీగిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి సంతకంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో... నిరుద్యోగులు గంపెడాశలతో నాటి నుంచి ఎదురుచూస్తునే ఉన్నారన్నారు. పైగా కోచింగ్‌ల కోసం లక్షలాది రూపాయలను వెచ్చించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం అదిగో డీఎస్సీ...ఇదిగో నోటిఫీకేషన్‌ అంటూ కాలయాపన చేయడం మాని వెంటనే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలతో పాటూ ఇతరత్రా టెక్నికల్‌ కోర్సులు చేసిన లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధ్యతారాహిత్యమని ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించారన్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు.

వలంటీర్లకు తీరని అన్యాయం

వలంటీర్ల ద్వారా గత ప్రభుత్వం ప్రతి గ్రామ గ్రామానా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందని ఉషశ్రీచరణ్‌ తెలిపారు. కోవిడ్‌ వంటి విపత్కర సమయంలో వలంటీర్ల సేవలతో యావత్‌ ప్రపంచమే జేజేలు పలికిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఇస్తున్న వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక..ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోగా..ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తమకు జరిగిన అన్యాయంపై గత కొన్ని రోజులుగా వలంటీర్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోవడం దురదృష్టకరమన్నారు. నిరుద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఉషశ్రీ చరణ్‌ హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, సర్పంచ్‌ లక్ష్మణ్ణ తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ అభ్యర్థులను

వంచిస్తోన్న చంద్రబాబు

వేతనాలు పెంచుతామని

వలంటీర్లకు మోసం

నిరుద్యోగ సమస్యపై సత్వరమే

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీచరణ్‌ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement