
హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం
అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమ జిల్లాలకు కల్పతరువు లాంటి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి అండగా ఉంటున్న ఆర్డీటీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా.. దానిపై వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది’ అని ఎంపీ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్, సమన్వయకర్తలు రీజినల్ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన సమస్యలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్ మినహా ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి, లైనింగ్ పనులను మొదలు పెట్టారన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పుదోవ పట్టించేందుకు ఇప్పటి వరకు 20 రకాల అంశాలను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్‌కు సీఎం చంద్రబాబు తెర లేపారన్నారు. అందులో ఏ ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారన్నారు.
డైవర్షన్ కోసమే..
ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం మద్యం స్కాంను తెరపైకి తెచ్చిందని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. దీనికి సంబంధించి రూపాయి కూడా సీజ్ చేయలేదన్నారు. రేషన్ షాపులను రద్దు చేస్తామంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. సమావేశంలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్‌కుమార్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి, సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, వై.వెంకటరామిరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్ అహ్మద్, మాజీ మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది
ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం
ఎంపీ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుదాం
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్‌లో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ మునిసిపాలిటీ, సర్పంచ్ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువుందని, ఆ లోపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుద్దామన్నారు. ఆర్డీటీకి అండగా ఉందామన్నారు. ప్రజానీకానికి ఆర్డీటీ అందిస్తున్న సేవలను ప్రభుత్వం విస్మరించిందని, ఇప్పుడు ఆ సంస్థ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలన్నారు. సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తూ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. వీటిపై అందరూ కలసికట్టుగా పోరాడుదామన్నారు. అనంతరం సమన్వయకర్తలు మాట్లాడారు.

హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం