
భూసేకరణపై రైతుల నిరసనాగ్రహం
హిందూపురం: పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం ఏడాదిలో మూడు పంటలు పండే పొలాలను సేకరించేందుకు సిద్ధం కాగా రైతులు భారీ ఎత్తున నిరసనకు దిగారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం హిందూపురం మండలం మలుగూరు, చలివెందుల, రాచేపల్లి, మీనకుంటపల్లి, కొండూరు గ్రామాల్లో భూములు సేకరించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే ఇటీవల కొందరు అధికారులు రైతులకు సమాచారం కూడా ఇవ్వకుండా సర్వేకు సిద్ధమయ్యారు. తమ జీవనాధారమైన భూములు తీసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను నిరసిస్తూ ఆయా గ్రామాల నుంచి వందలాది మంది రైతులు బుధవారం హిందూపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదురుగా బైఠాయించి లోనికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, రైతు సంఘం నాయకులు మాట్లాడారు. చంద్రబాబూ.. వ్యవసాయం నుంచి మమ్మల్ని దూరం చేయకు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతే... దేశానికి వెన్నముక అంటారని, అలాంటి రైతుల పొలాలను లాక్కోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను లాక్కుంటే వ్యవసాయమే జీవనాధారంగా బతికే వందలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి తలెత్తుతుందన్నారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు ఈ భూములు లేకపోతే రోడ్డున పడతామన్నారు.
సమాచారం ఇవ్వకుండా సర్వే ఎందుకు
మలుగూరు రెవెన్యూ పొలాల్లో రైతులకు తెలియకుండానే భూ సర్వే చేయించడమేమిటి రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. రైతులు గంటల తరబడి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే కార్యాలయంలోనికి వెళ్లారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్ కల్పించుకుని తనకు పూర్తి విషయం తెలియదని, అయితే అనుమతి లేకుండా ఎవరి భూములూ సేకరించబోమని తెలిపారు. భూసేకరణ ఏదైనా ఉంటే తప్పక తెలిజేస్తామంటూ రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం తహసీల్దార్ చిలమత్తూరు ఆఫీసుకు వెళ్లారని, ఆయన వచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తారని సమాధానం చెప్పారు. అయితే రైతులు దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో సర్వే నిర్వహించేందుకు తహసీల్దార్ రాగా, తామే కార్యాలయానికి వస్తామని, అప్పుడే సమాచారం ఇవ్వాలని కోరామన్నారు. ఇప్పుడు ఆయనే కార్యాలయంలో లేకుండా వెళ్లిపోవడం చూస్తే ఏదో జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేదని లేదన్నారు. తహసీల్దార్ ఏమైనా చెప్పాలనుకుంటే ఆయనే, తమ గ్రామానికి రావాలని చెప్పారు. అనంతరం తమ భూములు సేకరించవద్దని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించి వెనుదిరిగారు. రైతుల నిరసనకు రైతు సంఘ నాయకులు, వివిధ పార్టీ నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి, సిద్దారెడ్డి, ఓడీడీఆర్ శ్రీనివాసులు, చైతన్య గంగిరెడ్డి, సోమకుమార్, రవీంద్రరెడ్డి, పెద్దన్న, వెంకటరెడ్డి, అంజన్‌రెడ్డి, బీఎస్పీ శ్రీరాములు పాల్గొన్నారు.
హిందూపురం
తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
మూడు గ్రామాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన రైతులు
తమకు తెలియకుండానే భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ ఆగ్రహం
వ్యవసాయం నుంచి తమను దూరం చేయకండని వేడుకోలు
భూ సేకరణను అడ్డుకున్న రైతులు
లేపాక్షి: మండలంలోని కొండూరు గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణను రైతులు బుధవారం అడ్డుకున్నారు. భూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను వెనక్కు పంపారు. అనంతరం తమ జీవనాధారమైన భూములను సేకరించవద్దని తహసీల్దార్ సౌజన్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.

భూసేకరణపై రైతుల నిరసనాగ్రహం

భూసేకరణపై రైతుల నిరసనాగ్రహం