
లేపాక్షిలో జిల్లా స్థాయి యోగా దినోత్సవం
● కలెక్టర్ టీఎస్ చేతన్
లేపాక్షి: జిల్లా స్థాయి యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన లేపాక్షిలో యోగా దినోత్సవ ఏర్పాట్ల కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్బంగా నంది విగ్రహం, జఠాయువు, వీరభద్రస్వామి దేవాలయ ఆవరణ, ఆర్టీసీ బస్టాండు, నవోదయ విద్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం నవోదయ విద్యాలయలో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి నెలరోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గురువారం నుంచి తహసీల్దార్, ప్రిన్సిపాల్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయలో యోగా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ చేతన్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు.
యోగా జీవితంలో భాగం కావాలి
పుట్టపర్తి టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, దాన్ని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించే ‘యోగా మంత్’ కార్యక్రమాన్ని కలెక్టర్ చేతన్ బుధవారం స్థానిక సాయి ఆరామంలో ప్రారంభించి యోగాసనాలు వేశారు.
ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్‌లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్‌టీయూ(ఏ) వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం. అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.