నేడు సంజీవపురం నుంచి సీఎం బస్సు యాత్ర | - | Sakshi
Sakshi News home page

నేడు సంజీవపురం నుంచి సీఎం బస్సు యాత్ర

Apr 1 2024 1:45 AM | Updated on Apr 1 2024 10:27 AM

- - Sakshi

కదిరిలో ఇఫ్తార్‌ విందుకు హాజరు కానున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఆత్మీయ స్వాగతం పలికేందుకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ దూసుకుపోతోంది. సిద్ధం సభలు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సభలు.. రోడ్‌షో.. కార్యక్రమం ఏదైనా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. సంక్షేమ పాలనకు జై కొడుతున్నారు. సమరోత్సాహంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి.

సాక్షి, పుట్టపర్తి: సంక్షేమ పాలన ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాక సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా సోమవారం ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. తమ నాయకుడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. జగన్‌ను నేరుగా చూసేందుకు వృద్ధులు, వికలాంగులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా తరలి రానున్నారు. దారి పొడవునా స్వాగతం పలికేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. కదిరి పట్టణంలోకి ప్రవేశించగానే అపూర్వ స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.

ముస్లింలకు పెద్దపీట
‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరు నా వాళ్లే’ అని చెప్పే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అదే మాట ప్రకారం ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లు కేటాయించారు. కదిరి అసెంబ్లీ స్థానం నుంచి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన బీఎస్‌ మక్బూల్‌ అహ్మద్‌కు అవకాశం కల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింలు సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లోనూ కదిరి సీటును అత్తార్‌ చాంద్‌బాషాకు కేటాయించారు. ఇక్కడ మళ్లీ 2024లోనూ ముస్లిం మైనార్టీకే అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 2019లో హిందూపురం అసెంబ్లీ టికెట్‌ను ఇక్బాల్‌ అహ్మద్‌కు ఇచ్చారు. ప్రతి ఎన్నికలోనూ జిల్లాలో ముస్లింలకు ఒక సీటు కచ్చితంగా ఇస్తున్నారని ఆ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు.

కదిరిలో టీడీపీకి షాక్‌
2014లో కదిరి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అత్తార్‌ చాంద్‌బాషా తర్వాత టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. టీడీపీలో ముస్లింలకు తగిన ప్రాధాన్యం లేదని.. చేసిన తప్పు సరిదిద్దుకుని తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు అత్తార్‌ చాంద్‌బాషా ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.

‘అనంత’లో సూపర్‌ సక్సెస్‌
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. శనివారం గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంత పురం, రాప్తాడు నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్రకు జనం పోటెత్తారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా ఐదారు గంటలు నిలబడి, తమ అభిమాన నేతను చూడగానే ఉదయం నుంచి పడిన కష్టాన్ని అందరూ ఒక్క నిమిషంలో మర్చిపోయారు. సీఎం జగన్‌ రోడ్‌షోను చూసేందుకు ప్రజలు, మహిళలు సాయంత్రం 5 నుంచే దారి పొడవునా బారులుదీరారు. రాత్రి 11.30 గంటలైనా రోడ్‌షో వెంబడి జనప్రవాహం కనిపించింది. వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన తాము ఎన్ని గంటలైనా జగన్‌ను చూశాకే ఇంటికెళతామని చెప్పడం ఆయనపైన ప్రజలకున్న అభిమానానికి నిదర్శనం. అనంతపురం జిల్లాలో 75 కిలోమీటర్ల బస్సు యాత్రకు 8 గంటల సమయం పట్టిందంటేనే జనాభిమానం ఎంతలా ఎగిసిపడిందో చెప్పవచ్చు. శ్రీసత్యసాయి జిల్లాలోనూ బస్సుయాత్ర అదే రీతిలో కొనసాగుతుందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నేటి బస్సు యాత్ర ఇలా..
బత్తలపల్లి మండలం సంజీవపురంలో బస చేసిన కేంద్రం నుంచి సీఎం జగన్‌ సోమవారం ఉదయం 9 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగిస్తారు. అనంతరం బత్తలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి నడింపల్లి, కాళసముద్రం, ఎర్రదొడ్డి, కుటాగుళ్ల వరకు యాత్ర సాగుతుంది. కుటాగుళ్లలో మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి కదిరి పట్టణంలోకి ప్రవేశిస్తారు. పీవీఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ముస్లింల ఇఫ్తార్‌ విందులో సీఎం పాల్గొంటారు. తర్వాత మొటుకపల్లి, జోగన్నపేట, ఎస్‌ ములకలపల్లె మీదుగా చీకటిమానేపల్లికి చేరుకుని అక్కడే బస చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement