● పరిగి వైద్య శిబిరంలో
ఎమ్మెల్యే శంకరనారాయణ,
కలెక్టర్ అరుణ్‌బాబు, ఎమ్మెల్సీ మంగమ్మ
పరిగి: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’తో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, కలెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు. పరిగి జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ సరస్వతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకరనారాయణ మాట్లాడుతూ... సచివాలయ వ్యవస్థతో సీఎం జగన్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ క్రమంలోనే పల్లె ముంగిటే వైద్యం అందేలా చర్యలు చేపట్టారన్నారు. ఆరోగ్యశ్రీతో ఎందరికో ప్రాణాలు పోశారని, ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థతో ఇళ్ల వద్దకే వైద్యులు వెళ్లి సేవలందిస్తున్నారన్నారు. తాజాగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చూస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య సేవలను చేరువ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉందామన్నారు. ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ...ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే ఏకై క నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. ఆరోగ్య ప్రధాతగా దివంగత నేత వైఎస్సార్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షాన నిలబడి, అభివృద్ధితో పాటూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారన్నారు.
సురక్ష యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి..
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కలెక్టర్ అరుణ్‌బాబు సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ప్రజలకు ఇంటి వద్దకే వైద్య సేవలు ప్రభుత్వం చేరువ చేసిందని, ప్రభుత్వ లక్ష్యసాధనే ధ్యేయంగా అధికారులు సమష్టిగా పని చేయాలన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు పంపి శస్త్ర చికిత్సలు చేయిస్తామని, అవసరమై మందులూ అందిస్తామన్నారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంపులో పరీక్షలు చేయించుకున్న వారి ఓపీ షీట్‌తో పాటూ ఆరోగ్య సురక్ష కార్యక్రమ బుక్‌లెట్‌లను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్ తదితరులు ఆవిష్కరించారు. అనంతరం వైద్యఆరోగ్యశాఖ స్టాల్‌తో పాటూ అంగన్‌వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను కలెక్టర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పరిశీలించారు. కార్యక్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష రాష్ట్ర కోఆర్డీనేటర్ శివశంకర్, జిల్లా నోడల్ అధికారి కుల్లాయప్పనాయక్, స్పెషలాఫీసర్ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ సరస్వతి, తహసీల్దారు సౌజన్యలక్ష్మి, ఎంపీపీ సవిత, సర్పంచ్ లక్ష్మీదేవి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ స్వరూపరెడ్డి, డాక్టర్ సురేష్‌కుమార్, సీహెచ్‌ఓ వన్నప్ప, జెడ్పీటీసీ శ్రీరామప్ప, వైస్ ఎంపీపీ వేదవతి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.