పరిసరాల శుభ్రతపై అవగాహన

ముదిగుబ్బ: మండల పరిధిలోని మలకవేమల పీహెచ్‌సీని శుక్రవారం డీఎంఅండ్‌హెచ్‌ఓ ఎస్వీ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎం.కొట్టాల గ్రామంలో జరుగుతున్న ప్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జూన్ నుంచి నవంబర్ వరకు వర్షాలు కురుస్తాయి కాబట్టి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పరిసరాల శుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నాగేంద్రనాయక్, ఏఎంఓ లక్ష్మీనాయక్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ దేవల నాయక్, సూపర్‌వైజర్ శశిధర్, పీహెచ్‌ఎన్ లక్ష్మీనరసమ్మ, ఎంపీహెచ్‌ఈఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఏఎన్‌ఎం కృష్ణవేణి, ఎంపీహెచ్‌ఎస్ హరినాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగుల
రక్షణే ధ్యేయం
పుట్టపర్తి అర్బన్: ఆర్టీసీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల రక్షణే ధ్యేయంగా మహిళా వేధింపుల కమిటీ పని చేస్తుందని ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ మాల్యవంతం మంజుల పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి ఆర్టీసీ రీజనల్ కార్యాలయంలో ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. దిశ చట్టం మహిళలకు వరం లాంటిదన్నారు. అనంతరం మహిళా ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా మహిళలు వేధింపునకు గురైతే కమిటీ సభ్యులు ప్రత్యక్షమవుతారన్నారు. ఈ మహిళా వేధింపుల కమిటీకి చైర్‌పర్సన్‌గా మంజుల, అడ్వకేట్ జయకళ, మెంబర్లుగా శోభరాణి, హంపన్న, కళ్యాణిలను ఎంపిక చేశారు. సమావేశంలో ఆర్‌ఎం మధుసూధన్, డిపో మేనేజర్ ఇనాయితుల్లా, పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, హంపన్న, పార్థసారధిరెడ్డి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.