తొలిసారి స్క్రైబ్స్‌ లేకుండా..

ల్యాప్‌టాప్‌ ద్వారా పరీక్షలు 
రాయనున్న విద్యార్థులు  - Sakshi

రాప్తాడు రూరల్‌: అంధ విద్యార్థులు పరీక్షలు రాయాలంటే కచ్చితంగా స్క్రైబ్‌ (సహాయకారి) అవసరం. అంధ విద్యార్థులు జవాబులు చెబితే స్క్రైబ్‌రాసేవారు. అయితే రాష్ట్రంలో తొలిసారి అంధ విద్యార్థులు స్క్రైబ్‌ అవసరం లేకుండా సొంతంగా ల్యాప్‌టాప్‌ ద్వారా పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల్లో ఆర్డీటీ నిర్వహిస్తున్న అంధ స్కూల్‌ నుంచి ఆరుగురు విద్యార్థులు ఈ విధంగా రాసేందుకు ముందుకొచ్చారు. ఎక్కలూరు దివ్యశ్రీ, పొలిమేర చైత్రిక, ఏకుల సౌమ్య, మేకా శ్రీధత్రి, ఉప్పర నాగరత్నమ్మ, చంచుగారి పావని ల్యాప్‌టాప్‌ ద్వారాజిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు. వీరి పరీక్షలకు డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు పరీక్ష రాసే విధానంపై డెమో కూడా ఇచ్చారు.

ముందుగా ప్రశ్నలన్నీ ల్యాప్‌టాప్‌లోకి...

పరీక్షల సమయంలో ముందుగా ఇన్విజిలేటర్‌ ఆయా విద్యార్థులకు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు చెప్పగానే ల్యాప్‌టాప్‌లోకి ఎక్కించుకుంటారు. వారికి అర్థమయ్యేలా చిన్నశబ్దం వస్తుంది. ఈ శబ్దం ఆధారంగానే ఇది ఫలానా ప్రశ్న అని వారికి అర్థమవుతుంది. ఆ ప్రశ్నకు అవసరమైన జవాబును ల్యాప్‌టాప్‌లోనే పొందుపరుస్తారు. ఇలా అన్ని ప్రశ్నలకూ జవాబులు రాయడం పూర్తయిన తర్వాత ల్యాప్‌టాప్‌ నుంచి వారు రాసిన జవాబు పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీస్తారు. ఆ హార్డ్‌కాపీలకు ఓఎంఆర్‌ షీటును జతచేసి మూల్యాంకనానికి పంపుతారు. ప్రతి పరీక్షలోనూ ఇదే విధంగా చేస్తారు. డీఈఓ ఎం.సాయిరామ్‌, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ మాట్లాడుతూ ఆర్డీటీ స్కూల్‌లో మొత్తం 63 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. వారిలో ఆరుగురు విద్యార్థులు ల్యాప్‌టాప్‌ ద్వారా పరీక్షలు రాయనున్నారు. తక్కినవారందరికీ స్క్రైబ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ల్యాప్‌టాప్‌ ద్వారా పరీక్షలు రాసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ల్యాప్‌టాప్‌ ఆధారంగా ‘పది’ పరీక్షలు రాయనున్న అంధ విద్యార్థులు

ఆర్డీటీ స్కూల్‌ నుంచి ఆరుగురు విద్యార్థులకు అవకాశం

డైరెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ నుంచి అనుమతి

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top