కదిరి టీడీపీ అభ్యర్థి ఈయనే అన్నట్టు కందికుంట చేయి పైకెత్తి సంకేతాలిస్తున్న లోకేష్
అత్తార్ చాంద్‌బాషా పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. వైఎస్సార్ సీపీ తరఫున గెలిచి టీడీపీ పంచన చేరినా... ఆపార్టీ నేతలు ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. కదిరి టికెట్ సంగతి దేవుడెరుగు... కనీసం మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వడం లేదు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలోనూ ఇది తేటతెల్లమైంది.
శ్రీ సత్యసాయి: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యవగళం పాదయాత్ర ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు కదిరి నియోజకవర్గంలో ప్రవేశించి మూడు రోజులు కొనసాగింది. పాదయాత్ర ఆద్యంతం టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కే లోకేష్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కదిరి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న అత్తార్ చాంద్‌బాషాను పూర్తిగా పక్కనపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా గెలుపొంది చాంద్‌బాషా ఆ తర్వాత డబ్బు, మంత్రి పదవి టీడీపీలో చేరారు. పార్టీలో చేరే వరకూ ‘చాంద్‌మామ’ రావేనంటూ జోలపాడిన టీడీపీ అధినేత ఆతర్వాత ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టారు.
మొదటి రోజే అవమానం
లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 17న సాయంత్రం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గం చీకటిమానిపల్లిలోకి ప్రవేశించింది. ఆ సమయంలో లోకేష్‌కు అత్తార్ చాంద్‌బాషా వర్గం ఘన స్వాగతం పలికింది. అదే సమయంలో కందికుంటతో పాటు పరిటాల శ్రీరామ్ వర్గీయులూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన ఒక కార్యకర్త గజమాల తీసుకొచ్చి లోకేష్ మెడలో వేయగా, ఆయన వెంటనే దాన్ని తీసి పక్కనే ఉన్న కందికుంట మెడలో వేశారు. ఈయనే మీ కదిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అని చెప్పకనే చెప్పారు. అక్కడే ఉన్న అత్తార్ చాంద్‌బాషా వర్గం దీన్ని జీర్ణించుకోలేక పోయింది.
మైక్ ఇచ్చింటే ఒట్టు
నల్లచెరువు మండలం జోగన్నపేట వద్ద జరిగిన బహిరంగ సభలో లోకేష్‌తో పాటు కందికుంట ప్రసాద్ మాత్రమే పార్టీ కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తర్వాత అత్తార్ చాంద్‌బాషాకు మైక్ ఇవ్వాలని ఆయన వర్గీయులు గట్టిగా అరిచినప్పటికీ... లోకేష్ ఏమాత్రం పట్టించుకోకుండా సమావేశాన్ని ముగించారు. దీనికి తోడు అదే వేదికపై లోకేష్ కందికుంట చేయి పట్టుకొని పైకెత్తి ఈయనే మీ అభ్యర్థి అనే అర్థం వచ్చే విధంగా వ్యవహరించారు. దీన్ని చూసి అత్తార్ వర్గానికి మరింత కోపమొచ్చింది. తర్వాత ఈ నెల 20న (సోమవారం) కదిరి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో లోకేష్ సారథ్యంలో ఉదయం బీసీ సదస్సు, మధ్యాహ్నం మైనార్టీ సదస్సులు నిర్వహించారు. బీసీ సదస్సులో అత్తార్‌కు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం మైనార్టీ సదస్సులోనైనా అత్తార్‌కు మాట్లాడే అవకాశం ఇస్తారని అందరూ ఊహించారు. కానీ అక్కడా అవకాశం ఇవ్వలేదు. దీంతో అత్తార్ వర్గం మరింత ఢీలా పడింది. అదే విధంగా దారి పొడవునా అత్తార్ వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే కందికుంట వర్గం అడుగడుగునా అడ్డు తగిలింది. ఎక్కడా చాంద్ ఫ్లెక్సీలు కనబడకుండా వారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
ముస్లింలకు జరిగిన అవమానం
లోకేష్ యువగళం పాదయాత్రలో అత్తార్ చాంద్‌బాషాకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని భావించిన ఆయన అనుచరుల్లోని కొందరు ముస్లింలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ‘ఇది చాంద్‌కు జరిగిన అవమానం కాదు..మొత్తం ముస్లింలందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాం’ అని వారంటున్నారు. చాంద్‌బాషాకు మంత్రి పదవి ఇస్తామని, అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ కదిరి టికెట్ మళ్లీ చాంద్‌కే ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసగించారని, ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు లోకేష్ ఇలా అత్తార్‌ను అవమానించడం దేనికి సంకేతం? అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి 2024 ఎన్నికల్లో కదిరి టికెట్ అత్తార్‌కు ఇవ్వనట్లేనా? అని వారు అనుమానం వ్యక్తం చేస్త్తున్నారు. మరోవైపు కందికుంటపై ఉన్న కేసుల కారణంగా ఆయన ఎన్నికల బరిలోకి దిగేందుకు సాంకేతిక కారణాలు తలెత్తితే ఆయన సతీమణి కందికుంట యశోదమ్మకు కదిరి టికెట్ ఖాయం..అని కందికుంట వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అత్తార్ పరిస్థితి అగమ్యగోచరమైంది.


