● కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశం
నెల్లూరురూరల్: జిల్లాలో 22ఏ, చుక్కల భూములు, రీ సర్వే కేసులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనసాగుతున్న రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పెండింగ్ లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని, అధికారులు తమ పరిధిలో స్పష్టమైన పురోగతి చూపించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


