డాక్యుమెంట్‌ రైటర్ల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

డాక్యుమెంట్‌ రైటర్ల వినూత్న నిరసన

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

ఉదయగిరి: జీఓ నంబర్‌ 396ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ ఎదుట ఒంటి కాలిపై నిలిచి వినూత్న నిరసనను డాక్యుమెంట్‌ రైటర్లు మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పీపీపీ విధానంలో సేవా కేంద్రాల ఏర్పాటును రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ జీవనోపాధికి గండి కొట్టేందుకే ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

డీసీపల్లిలో 320 పొగాకు

బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 320 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. వేలానికి 528 బేళ్లు రాగా, వీటిలో 320ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 44,169 కిలోల పొగాకును విక్రయించగా, రూ.84,88,476.80 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.160.. సగటు ధర రూ.192.18గా నమోదైందని చెప్పారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు.

శ్రీవారి దర్శనానికి

15 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 80,003 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,918 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.59 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

బాలల హక్కుల పరిరక్షణకు

ప్రత్యేక చర్యలు

నెల్లూరు(పొగతోట): బాలల హక్కులకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ వేటుకూరి సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. నగరంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, చిల్డ్రన్స్‌ హోమ్‌ను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. బాలలకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని పేర్కొన్నారు. నిబంధనలను పాటించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వాత్సల్య చిల్డ్రన్స్‌ హోమ్‌ను సందర్శించి, అక్కడి పిల్లలతో మాట్లాడారు. బాలల సంరక్షణ, పరిరక్షణ చట్టం – 2015 మేరకు హోమ్‌ను నిర్వహిస్తున్నారాననే అంశాన్ని ఆరాతీశారు. కమిషన్‌ సభ్యురాలు వెంకటపద్మలత, ఐసీడీఎస్‌ పీడీ హేనాసుజన్‌, డీసీపీఓ సురేష్‌, సీడీపీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement