మెగా డీఎస్సీ నియామకాల పేరుతో టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్న చరిత్ర లోకేశ్‌దేనని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఎలాంటి అర్హతల్లేని వారికి టీచర్ ఉద్యోగాలను కట్టబెట్టి విద్యావ్యవస్థ విలువలను దిగజార్చారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన టీచర్ ఉద్యోగాలన్నీ అక్రమమని.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను సర్కార్ మోసం చేసి వారి భవిష్యత్తుతో చెలగాటమాడిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, వసతి దీవెన నిధుల విషయాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిగా నెలకు రూ.మూడు వేలను అందిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు ఒక్కరికీ దీన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకంలో అర్హత పేరుతో అనేక మంది మాతృమూర్తులను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఈ అంశాలపై రానున్న రోజుల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉద్యమించనున్నామని స్పష్టం చేశారు.


