400కుపైగా ఉద్యోగాల భర్తీలో అవినీతి జరిగిందని.. ఒక్కో జాబ్‌కు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగాయని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియోలు బయటకొచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు. విద్యావ్యవస్థపై మాట్లాడే హక్కు స్టూడెంట్స్‌కు ఉందని, వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉందని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలైన క్రీడాకారులకు అవకాశాలను కల్పించకుండా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు నిబంధనలనే మార్చారని విమర్శించారు. జీఓ నంబర్ 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటాను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచడమే కాకుండా, పోటీ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందేలా నిబంధనలను సవరించారని ధ్వజమెత్తారు.


