● రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన ఆటో
● బైక్‌ను ఢీకొట్టడంతో యువకుడి మృతి
నెల్లూరు(క్రైమ్): ఆ యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. కష్టపడి పనిచేసి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ ఆ ప్రయాణం మధ్యలోనే ముగిసింది. రాంగ్‌రూట్‌లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఆటో ఢీకొనడంతో కోవూరు మండలం ఇనుమడుగు గ్రామానికి చెందిన కె.హేమంత్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. హేమంత్ నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఐఆర్‌సీటీసీ స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం విధుల నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. రాత్రి సుమారు 10:30 గంటలకు పని ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. పాత పెన్నా బ్రిడ్జి మధ్యలోకి చేరుకోగానే వెంకటేశ్వరపురం వైపు నుంచి రాంగ్‌రూట్‌లో మితిమీరిన వేగంతో వచ్చిన ఆటో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమంత్‌కు తలకు, కుడి మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హేమంత్‌తోపాటు ఆటోలో గాయపడిన ఇద్దరిని జీజీహెచ్‌కు తరలించారు. అయితే హేమంత్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కొడుకు మృతి వార్త తెలుసుకున్న తల్లి మల్లేశ్వరి, కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా హేమంత్ మృతితో ఆగ్రహానికి గురైన అతని బంధువులు, స్నేహితులు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆటోలోని ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కూడా ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టారు.


