రూ.కోట్లు కొల్లగొట్టి | - | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు కొల్లగొట్టి

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

రెండేళ్ల టీడీపీ పరిపాలనలో ఇరిగేషన్‌శాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. కేవలం నేతల జేబులు నింపేందుకే అధికారులు పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి విలయతాండవాన్ని సైతం కాసులుగా మార్చుకుంటూ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. గత ఏడాదిలో చూస్తే ఎఫ్‌డీఆర్‌ కింద దాదాపు రూ.100 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌ (రిపేర్స్‌ అండ్‌ రెన్యువేషన్‌ రీస్టోరేషన్‌) ద్వారా దాదాపు రూ.30 కోట్లు, ఓఅండ్‌ఎం ( ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ) ద్వారా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఆయా పనులు సర్వేపల్లి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌, కోవూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల అధికార పార్టీ నేతలకు భోజ్యంగా మారాయి. పనులు చేయకుండానే బిల్లులు పెట్టుకుంటున్నారు. అధికారులకు మాత్రం 20 శాతం కమీషన్‌ ఇస్తే చాలు బిల్లులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కాలువలకు గండ్లు

కలువాయి మండలంలోని కుల్లూరు డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువకు మూడు రోజుల క్రితం గండిపడింది. ఇటీవలే ఆ కాలువకు ఎఫ్‌డీఆర్‌ ద్వారా రూ, 4.5 లక్షలతో మరమ్మతులు చేసినట్లు చూపి బిల్లులు డ్రా చేసినట్లుగా ఆరోపణలున్నాయి. కానీ నీరు విడుదల చేయగానే గండిపడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలువ కింద దాదాపు 600 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. కాలువకు గండిపడడంతో అధికారులు ప్రస్తుతం ఇసుకబస్తాలతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ఇసుక బస్తాలకు కూడా మళ్లీ బిల్లులు పెట్టే అవకాశం లేకపోలేదు. అధికారులు, టీడీపీ నేతలతో కుమ్మకై ్క సొంత జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేస్తుండడంపై రైతాంగం మండిపడుతోంది. ఇటీవలే సోమశిల దక్షణ కాలువ పరిధిలో ఎఫ్‌డీఆర్‌ నిధులు రూ.7 కోట్లతో దాదాపు 112 పనులు చేసినట్లుగా చూపి బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలున్నాయి. అలాగే బెజవాడ పాపిరెడ్డి కాలువ(కావలి కాలువ)కు భారీ గండి పడింది. సంగం మండలంలోని మర్రిపాడు గ్రామం వద్ద ఈ కాలువ సైఫన్‌ అక్విడెక్ట్‌ కొట్టుకుపోయింది. దీంతో కాలువలో వెళ్లాల్సిన సాగునీరు దువ్వూరు చెరువులోకి ప్రవహిస్తోంది. అక్కడ కూడా అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు నింపి బిల్లులు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో కావలి కాలువ ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 94 పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. అప్పట్లో అక్రమాలకు పాల్పడిన అధికారే ప్రస్తుతం ఆ కాలువ బాధ్యతలు చూస్తుండడం విశేషం.

నెల్లూరు ఇరిగేషన్‌ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఆ శాఖ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. వర్కులు చేయకున్నా

20 శాతం కమీషన్లతో బిల్లులు చేస్తున్నారు. దీంతో సాగునీటి కాలువలకు గండ్లు పడి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలోని కుల్లూరు డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువ, కావలి కాలువకు గండ్లు పడడంతో వందలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం లేక రైతాంగం ఆందోళన చెందుతోంది. కేవలం తాము చెప్పినట్లుగా వినే అధికారులను నిబంధలకు విరుద్ధంగా ఇన్‌చార్జ్జిలుగా నియమించుకుని అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. –సాక్షి ప్రతినిధి, నెల్లూరు

ఇన్‌చార్జిల పాలనలో

ఇరిగేషన్‌ శాఖ

ఎఫ్‌డీఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, ఓఎండ్‌ఎం పనుల్లో చేతివాటం

పనులు చేయకుండానే నిధుల ఆరగింత

అధికారులకు 20 శాతం కమీషన్లు

కార్యాలయాలకే

పరిమితమవుతున్న ఇంజినీర్లు

కుల్లూరులో డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండి

సంగంలో కావలి కాలువకు గండి

ఆందోళనలో అన్నదాతలు

ఇన్‌చార్జిల పాలనతో..

జిల్లాలో ఇరిగేషన్‌ శాఖ అంతా ఇన్‌చార్జి అధికారుల పాలనలోనే కొనసాగుతోంది. రెగ్యులర్‌ అధికారులు ఉంటే ఎక్కడ తమ జేబులు నింపరోనని టీడీపీ ఎమ్మెల్యేలు తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులను నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌చార్జులుగా పోస్టుల్లో కూర్చోబెట్టి బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తెలుగుగంగ, సోమశిల ఎస్‌ఈ పోస్టుల్లో సైతం ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. అలాగే వెంకటగిరి డీఈగా పనిచేసే అధికారికి గూడూరు డివిజన్‌ ఈఈ పోస్టులో కూర్చోబెట్టారు. కావలి ఈఈతో పాటు డీఈ పోస్టుల్లో కూడా ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. ఉదయగిరి డీఈని నెల్లూరు డ్రైనేజీ ఈఈగా, నెల్లూరు డివిజన్‌ డీఈగా ఉన్న అధికారికి తెలుగుగంగ ఈఈగా అదనపు బాధ్యతలను అప్పగించి జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ శాఖ మరో అడుగు ముందుకేసి పలనాడు జిల్లాలో పనిచేసే అధికారికి డైవర్షన్‌ కింద ఉదయగిరి, ఆత్మకూరు డీఈగా బాధ్యతలు అప్పగించారంటే ఆ శాఖలోని పరిస్థితి తేటతెల్లం అవుతుంది. అలాగే వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం లో పనిచేసే అధికారిని ఆత్మకూరుకు డైవర్షన్‌ చేశారు. అలాగే పొదలకూరులో ఏఈగా పనిచేసే అధికారిని ఇన్‌చార్జి డీఈ నియమించుకుని అధికార పార్టీ నేతలు తమ జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

నాణ్యత చూడకుండానే..

జిల్లా ఇరిగేషన్‌ శాఖలో క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు కేవలం పర్సెంటేజీల కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈఈ తిరుపతికి పరిమితం కావడం, డీఈ, ఏఈ స్థాయి అధికారులు కార్యాలయాలకే పరిమితమై 5 శాతం కమీషన్‌తో పనులు పరిశీలన చేయకుండానే సర్టిఫై చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement