డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలి

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

నెల్లూరురూరల్‌: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని, ఈ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ నెల 28న నెల్లూరులో చేపడుతున్న వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి నిరసన ర్యాలీ పోస్టర్లను నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, గూడూరు పార్టీ సమన్వయకర్త బూదూరు గురవయ్య, యువజన, విద్యార్థి విభాగ నాయకులతో కలిసి కాకాణి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత కాకాణి మాట్లాడుతూ విద్యార్థులు, యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 28న నగరంలోని వీఆర్సీ సెంటర్‌ నుంచి గాంధీబొమ్మ సెంటర్‌ వరకు భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. మెగా డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ప్రభుత్వం జీఓలను వరుసగా మార్చుతూ నిరుద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేసిందని ఆరోపించారు. స్పోర్ట్స్‌ కోటా విషయంలో జీఓ ఎంఎస్‌4, 47, 56లను వరుసగా సవరించడం ద్వారా భారీ అవకతవకలకు తావిచ్చారని విమర్శించారు. సుమారు 420 మందికి పైగా స్పోర్ట్స్‌ కోటా పేరుతో అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపిస్తూ దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కాకాణి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని కోరారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్‌సీపీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తోందన్నారు. డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పకుండా అధికారులతో ప్రెస్‌మీట్లు పెట్టించి తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల వల్లే డీఎస్సీ నియామక ప్రక్రియ వివాదాస్పదంగా మారిందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు. దేశంలో నీట్‌ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ స్కామ్‌కు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మారిందని, డీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని అమలు చేయకుండా యువతను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా, ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల వంటి డిమాండ్లతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు భారీ విద్యార్థి, యువత నిరసన ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. యువత, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

డీఎస్సీ అవకతవకలపై

మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి

విద్యార్థి, యువత సమస్యలపై

పోరుబాట నేడు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

విద్యార్థి, యువత నిరసన ర్యాలీ

పోస్టర్ల ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement