నెలకు పది కాన్పులు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నెలకు పది కాన్పులు చేయాలి

Jul 28 2026 12:19 AM | Updated on Jul 28 2026 12:19 AM

మనుబోలు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు కనీసం పది కాన్పులు అయినా చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఆయన మనుబోలు పీహెచ్‌సీని స్టేట్‌ వ్యాక్సిన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ దేవదానం, జిల్లా మేనేజర్‌ రమేష్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్యసిబ్బందిని ఆరా తీశారు. ఆస్పత్రిలో కాన్పులు సక్రమంగా జరగడం లేదని తెలుసుకుని, కనీసం నెలకు పది అయినా చేయాలని, లేని పక్షంలో మెమో జారీ చేస్తామని హెచ్చరించారు. పీహెచ్‌సీల్లోనే కాన్పులు చేయించుకునేలా క్షేత్ర స్థాయిలో గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. వారి వెంట పీహెచ్‌సీ డాక్టర్‌ గేయ పూజిత, సీహెచ్‌ఓ రాజయ్య, పీహెచ్‌ఎన్‌ జయలక్ష్మి, సూపర్‌వైజర్‌ రమణయ్య ఉన్నారు.

పొగాకు రైతుల జాతీయ

రహదారి దిగ్బంధం రేపు

మర్రిపాడు : రాష్ట్ర పొగాకు రైతుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 29న చేపడుతున్న జాతీయ రహదారి దిగ్బంధనాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి, డీసీపల్లి పొగాకు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూలి వెంగయ్య, వైఎస్సార్సీపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చండ్ర నారాయణస్వామి, రైతు సంఘ మండల నాయకుడు గంగినేని నారాయణ మాట్లాడుతూ పొగాకు రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం, పొగాకు బోర్డు వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఉద్య మాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చ రించారు. రైతు నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కాకర్లను

నిలదీసిన కార్యకర్తలు

కొండాపురం: తమను పట్టించుకోకపోవడంపై టీడీపీ కార్యకర్తలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను నిలదీశారు. సోమవారం ఆయన సాయిపేట పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్యన నెలకొన్న విభేదాల నేపథ్యంలో అడుగడుగునా కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు పార్టీలో గుర్తింపు లేకుండా పంచాయతీకి చెందిన నాయకులు చేస్తున్నారని, మీరు కూడా వారికి వత్తాసు పలుకుతూ పనులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మేము ఓట్లు వేస్తేనే మీరు గెలిచారని, మా ఓట్లు కూడా ముఖ్యమేనని, చాలా కాలంగా పార్టీని కనిపెట్టుకుని ఉన్నామని, తమకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. తమను పార్టీలో గుర్తిస్తేనే పార్టీకి సేవలందిస్తామని, లేదంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని తెగేసి చెప్పారు.

శ్రీవారి దర్శనానికి

8 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,012 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement