● నిబంధనలకు విరుద్ధంగా
వ్యవహరిస్తున్న హైవే కాంట్రాక్టర్
● చెరువు పూడిపోతుందని
ఆయకట్టు రైతుల ఆందోళన
సీతారామపురం : సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్‌రోడ్డు సమీపంలో ఆరులైన్ల జాతీయ రహదారి 544 నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. హైవే నిర్మాణంలో భాగంగా తవ్విన మట్టిని సమీపంలోని స్వామి చెరువులో పెద్దఎత్తున డంప్ చేస్తున్నారు. స్వామిచెరువు కింద వందలాది ఎకరాల ఆయకట్టు ఉంది. జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన మట్టిని తోలడం వల్ల చెరువు పూడిపోయి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడి చెరువులోకి నీరు వచ్చినా గండిపడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. స్వామి చెరువుపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, చెరువులో గ్రావెల్ డంప్ చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై హైవే నిర్మాణదారులను పలుమార్లు హెచ్చరించినా వారు పెడచెవిన పెట్టడమే గాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపి స్తున్నారు. టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి తరలించి డంప్ చేసే క్రమంలో ఇప్పటికే ప్రధాన కాలువ పూడిపోయింది. దీంతో వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తడంతో పాటు ఆయకట్టుకు సాగునీరు అందకుండాపోయే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆయకట్టు రైతులు తహసీల్దార్ ఫజిహాను సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. గ్రావెల్ డంపింగ్ చేయడాన్ని నిలుపుదల చేసి చెరువును కాపాడాలని కోరారు.


