● వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా నాలుగు సెల్ప్‌ఫైనాన్స్ బీటెక్ కోర్సులను ప్రారంభిస్తున్నామని వైస్‌చాన్స్‌లర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన వీఎస్‌యూలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ప్రతి కోర్సుకు 60 చొప్పున మొత్తం 240 సీట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కోర్సులకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నా రు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్త్తుందని తెలిపారు. విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజురీయింబర్స్‌మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు (ల్యాబ్‌లు), విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివ రించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ, ఇంటర్న్ షిప్‌లు, ప్లేస్‌మెంట్ అవకాశాల కల్పనపై విశ్వవిద్యాలయం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో తక్కువ వ్యయంతో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే అరుదైన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


