ఉదయగిరి: పట్టణంలోని కోళ్లవీధికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఉదయగిరికి చెందిన షేక్ అలీ అక్బర్ (60) గతంలో దుబాయిలో డ్రైవర్‌గా పనిచేశాడు. కొంతకాలం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతని భార్య హబీబా అనారోగ్యంతో బాధపడుతుండగా, వీరికి సంతానం లేదు. నెలరోజుల క్రితం హబీబాకు గుండెపోటు రావడంతో చికిత్స చేయించాడు. అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన అన్ని పనులను అలీ చూసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో అతను కొంతకాలంగా మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం హబీబా ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో అలీ ఇంట్లో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతసేపటి తర్వాత భార్య ఇంట్లోకి వెళ్లి చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెంటనే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అలీ మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై మహేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.


