జిల్లాలో సాగునీటి భవిష్యత్‌పై దుర్భిక్ష మేఘాలు కమ్ముకుంటున్నాయి. కండలేరు, సోమశిల జలాశయాల్లో రోజు రోజుకూ క్షీణిస్తున్న నీటి నిల్వలు ఖరీఫ్ సాగుతోపాటు తాగునీటి భద్రతపైనా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలపై ఆశలు సన్నగిల్లగా, మరో వైపు చైన్నెతోపాటు జిల్లాలోని తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించకపోతే రానున్న రోజుల్లో సాగునీటికే కాదు.. తాగునీటికీ తీవ్ర సంక్షోభం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
కండలేరు జలాశయం
పొదలకూరు: మెట్ట ప్రాంత వరప్రసాదిని కండలేరు జలాశయంలో నీటి మట్టం పడిపోతున్న కొద్దీ జిల్లా వ్యవసాయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కరువై, జలాశయాలకు వరద ప్రవాహాలు నిలిచిపోవడంతో సాగునీటి సరఫరాపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. సకాలంలో వర్షాలు కురవకున్నా పైతట్టు నుంచి వరద ప్రవాహం లేకున్నా వ్యవసాయ రంగానికి నీటి విడుదల అటుంచి తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
జిల్లాకే తలమానికమైన సోమశిల జలాశయానికి ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం 31 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా అందులో 8 టీఎంసీల వరకు డెడ్ స్టోరేజీ కింద నిల్వ ఉంచాలి. మిగిలిన నీటిని సాగు, తాగునీటికి వినియోగించాల్సి ఉంటుంది. కండలేరులో 6 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉంచాల్సి ఉండగా చైన్నె తాగునీటి అవసరాలకు నీటి విడుదలను పెంపొందించాల్సిందిగా ఆ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం కండలేరుకు వచ్చి కోరింది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా సోమశిల, కండలేరు జలాలను తాగునీటికి వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ల కింద సమగ్ర రక్షిత మంచి నీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్ స్కీమ్స్) పథకాల ఉన్నాయి. ఎల్‌నినో కారణంగా విపరీతమైన భూతాపం పెరుగుతోంది. ఫలితంగా వర్షాలు, వరదలపై నమ్మకం పెట్టుకోవాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ముందస్తుగానే గ్రామాల్లో తక్కువ నీటి వినియోగంతో పండే పంటలను సాగు చేయాల్సిందిగా సూచిస్తున్నారు. రెండు ప్రాజెక్ట్‌ల కింద రబీలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. పొదలకూరు, మనుబోలు మండలాల్లోని కొన్ని గ్రామాలకు కండలేరు ఏటి కాలువకు ప్రాజెక్ట్ లోలెవల్ స్లూయిజ్ ద్వారా నిరంతరాయంగా స్వల్పంగానైనా సాగునీటిని విడుదల చేస్తుంటారు. రాపూరు మండలం సంక్రాంతిపల్లి పికప్ ఆనకట్ట నుంచి పిన్నేరు వాగు ద్వారా మనుబోలు మండలంలోని మరికొన్ని గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది.
30 టీఎంసీలు ఉంటేనే గ్రావిటీ నీరు
కండలేరు ఎడమ కాలువ మెట్టరైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ కాలువకు 300 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలువ వెంబడి చాలా మంది రైతులు ఖరీఫ్ కింద పంటల సాగు చేస్తున్నారు. కాలువకు గ్రావిటీ వాటర్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కండలేరుకు సోమశిల నుంచే ఇన్‌ఫ్లో రావాలి. కండలేరు జలాశయంలో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంటేనే హైలెవల్ స్లూయిజ్ ద్వారా గ్రావిటీ నీరు అందుతుంది. అయితే జలాశయంలో ఇప్పుడు 26 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నా సత్యసాయి గంగ కాలువకు 2 వేల క్యూసెక్కులు, ఒకటో బ్రాంచి కాలువకు 70, పిన్నేరు వాగుకు 5 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎడమగట్టు కాలువకు గ్రావిటీ నీరు అందే పరిస్థితి లేదు. ఫలితంగా ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అవసరమైతే విడుదల చేయాల్సి ఉంటుంది.
ఎల్‌నినో కారణంగా వేసవి తాపం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ముఖం చాటేస్తున్నాయి. జిల్లాలోనే కాక పైతట్టు ప్రాంతాల్లో వర్షం కురిసి ప్రాజెక్ట్‌లకు నీరు అందే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. కండలేరు జలాశయం కింద పొదలకూరు మండలంలో రెండు సీపీడబ్ల్యూఎస్ స్కీములు ఉన్నాయి. రాపూరు, గూడూరు తాగునీటి అవసరాలను కండలేరు జలాశయమే తీర్చుతోంది. చైన్నె మహా నగరానికి కండలేరు నుంచే తాగునీటిని అందిస్తున్నారు. వారు మరో 500 క్యూసెక్కుల నీటి విడుదల పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా నీటిని పొదుపుగా వినియోగించుకుంటేనే తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి నీటి బొట్టు విలువైనదిగా భావించి వృథా చేయకుండా ఉంటే రబీ సీజన్లో వర్షాలు కురువకున్నా కొంత వరకు కండలేరు ఎడమగట్టు కాలువ కింద పంపింగ్ స్కీమ్ ద్వారానైనా పంటలు పండించేందుకు వీలుకలుగుతుంది.
కండలేరులో తగ్గుతున్న నీటి మట్టం
నీటి పొదుపు పాటించకుంటే
తాగునీటికి కష్టాలే
ఎడమగట్టు కాలువకు గ్రావిటీ ద్వారా కొద్ది రోజులే
ఎల్‌నినో ప్రభావంతో
విపరీతమైన భూతాపం
ముందుచూపు
లేకుంటే ఇబ్బందే
నీటిని పొదుపు చేయాలి
ప్రాజెక్ట్‌ల్లో నీటిని పొదుపు చేయాలి. కరువు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్న తరుణంలో ప్రాజెక్ట్‌ల్లో నీటి నిల్వలను పొదుపుగా వినియోగించి రైతులకు సాగు నీటిని అందివ్వాలి. లేకుంటే ప్రజల తాగునీటి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది. – వై. పెంచలరెడ్డి, రైతు నాయకుడు, పులికల్లు


