బెజవాడ పాపిరెడ్డి కాలువకు భారీ గండి | - | Sakshi
Sakshi News home page

బెజవాడ పాపిరెడ్డి కాలువకు భారీ గండి

Jul 27 2026 12:12 AM | Updated on Jul 27 2026 12:12 AM

సైఫన్‌ ఆక్విడెక్ట్‌ కొట్టుకుపోయి

దువ్వూరు చెరువులోకి సాగునీరు

సంగం: జలవనరుల శాఖ నిర్వహణా లోపం, నిర్లక్ష్యానికి బెజవాడ పాపిరెడ్డి (కావలి) కాలువపై మండలంలోని మర్రిపాడు సమీపంలో నిర్మించిన సైఫన్‌ అక్విడెక్ట్‌ కొట్టుకుపోయింది. దీంతో కావలి కాలువకు గండి పడడంతో ఆ కాలువలో వెళ్లాల్సిన సాగునీరంతా దువ్వూరు చెరువులోకి ప్రవహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం, సైఫన్‌ అక్విడెక్ట్‌కు కొద్ది రోజుల క్రితమే స్వల్పంగా గండి పడింది. అప్పుడే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి, కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపించారు. సమస్యను ముందుగానే పరిష్కరించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు మండిపడుతున్నారు. శనివారం గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్న అధికారులు, అసలు సమస్యను పరిష్కరించకుండా తాత్కాలిక చర్యలకే పరిమితమయ్యారని రైతులు విమర్శించారు. దీంతో కాలువలో నీటి ఒత్తిడి మరింత పెరిగి ఆదివారం సైఫన్‌ అక్విడెక్ట్‌ పూర్తిగా కూలిపోయిందని తెలిపారు. ఫలితంగా భారీగా నీరు బయటకు వెళ్లిపోతూ దువ్వూరు చెరువులోకి చేరుతోంది. ఈ ఘటనతో మర్రిపాడు రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతినడంతో వందలాది ఎకరాల్లో సాగు పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే సాగులో ఉన్న పంటల సంరక్షణకు కూడా పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే బెజవాడ పాపిరెడ్డి కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు. లేకుంటే మరింత పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement