● డీఎస్‌ఓ పుల్లయ్య
నెల్లూరు (పొగతోట): జిల్లాలో 150 చౌకదుకాణాలను మినీమార్టులుగా మార్పులు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని డీఎస్‌ఓ పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1513 చౌకదుకాణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మండలానికి ఐదు చొప్పున మినీ మార్టులుగా మార్చేందుకు తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు సమన్వయంతో ఎంపిక చేస్తారన్నారు. మినీ మార్టులుగా మార్పు చేయడానికి ఫ్రంటీర్ మార్కెట్ సంస్థకు రేషన్ షాపు డీలర్ రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. చౌకదుకాణంలో అన్ని ఏర్పాట్లు చేసి మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి నెలా 24వ తేదీలోపు డీలర్ అవసరమైన సరుకులు సరఫరా చేయడానికి ఇండెంట్ పెట్టాల్సి ఉంటుందన్నారు. సరుకుల కోసం డీలర్ ముందుగానే నగదు చెల్లించాలన్నారు. అవసరమైన డీలర్లకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేయిస్తామన్నారు. డీలర్ ప్రతి నెలా రూ.800 లేదా ఒకే పర్యాయం నగదు బ్యాంకులకు తిరిగి రుణాన్ని కంతులుగా చెల్లించాలన్నారు.
బీజేపీతో
వ్యవస్థలు చిన్నాభిన్నం
● సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్
చైర్మన్ నారాయణ
గూడూరు: కేంద్రంలో బీజేపీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దేశంలో వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ విమర్శించారు. గూడూరులో ఆదివారం జరిగిన సీపీఐ నేత ప్రభాకర్ సంతాప సభకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో అన్ని వ్యవస్థలను విచ్ఛి న్నం చేస్తూ పాలన కొనసాగిస్తున్న బీజేపీ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిందన్నారు. నీట్ ప్రశ్న పత్రం లీక్ చేసి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్‌ను అగాధంలోకి నెట్టిందన్నారు. దీనిపై నిరసనలకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు సాధించిన గొప్ప విజయమన్నారు. ఇలానే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ప్రతి విషయంలో యువత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని పిలుపు నిచ్చారు. కార్మిక, ప్రజా వ్యతిరేక పోరాటలకు సిద్ధమవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కూడా సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై పోరాటం సాగించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, నాయకులు జమాలుల్లా, సునీల్, నారాయణ, రమేష్ బీకేఎంయూ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
ఎయిర్ రైఫిల్‌లో
గోల్డ్ మెడల్
మనుబోలు: మండలంలోని పిడూరు గ్రామానికి చెందిన ఒరువూరు నైనిక అండర్–14 ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. నర్సయ్య, రజిని దంపతుల కుమార్తె నైనిక కృష్ణపట్నంలోని అదానీ వరల్డ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల తమిళనాడులోని తిరుచ్చిలో నిర్వహించిన సౌత్ జోన్ అండర్–14 విభాగం ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. దీంతో నైనికను ఆదివారం పలువురు అభినందించారు.


