కన్నపేగుకే కన్నీటి శిక్ష | - | Sakshi
Sakshi News home page

కన్నపేగుకే కన్నీటి శిక్ష

Jul 27 2026 12:12 AM | Updated on Jul 27 2026 12:12 AM

ఆస్తి కోసం వృద్ధ తండ్రిని రోడ్డున పడేసిన కుమారులు

ఆత్మకూరురూరల్‌: కన్నప్రేమ కడతేరిపోతోంది. అనురాగాల పందిరి కింద ఆస్తుల చిచ్చు రగులుతోంది. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన కన్న కొడుకులే, ఆస్తి పంపకాల కోసం కన్న తండ్రిని వీధుల పాలు చేసిన దయనీయ ఉదంతమిది. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి, వారి భవిష్యత్‌ కోసం ఆస్తిని సమకూర్చిన ఆ తండ్రికి ఇప్పుడు అశ్రునయనాలు, అనాథ బతుకు మిగిలింది.

రామస్వామిపల్లి గ్రామానికి చెందిన వద్ది రమణయ్య తన జీవితకాలంలో కష్టపడి 8 ఎకరాల పొలం, రెండిళ్లను సంపాదించాడు. కొడుకులిద్దరికీ ఏ లోటు రాకూడదని భావించిన ఆ తండ్రి స్వేదమే ఆ ఆస్తులకు పునాది. పెద్ద కుమారుడు కరెంట్‌ పని చేస్తూ, ఇటీవల పక్షవాతం బారిన పడ్డాడు. చిన్న కొడుకు ఓ సబ్‌స్టేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అయితే వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రికి విశ్రాంతినివ్వాల్సిన కొడుకులు, కోడళ్లు, అతడు కష్టపడి సంపాదించిన ఆస్తులపై కన్నేశారు. ఆస్తి నాకంటే నాకే రాయాలి అని ఒకరు, నాకు అనుకూలంగా ఇవ్వాలి అని మరొకరు నరకాన్ని చూపుతున్నారు. వయసు మళ్లడంతో రమణయ్యకు వినికిడి శక్తి బాగా తగ్గింది. ఎదుటి వారు గట్టిగా చెబితే తప్ప మాటలు వినపడవు. కానీ ఆ అశక్తతను కూడా కనికరించకుండా, కొడుకులతోపాటు ఆయన కోడళ్లు కూడా కలిసి వృద్ధుడిపై భౌతిక దాడులకు, తీవ్ర మానసిక వేధింపులకు పాల్పడుతుండడం మానవత్వానికే మచ్చ. ఆస్తులను తమ పేరిట రాయించుకోవడానికి ఆ వృద్ధుడిని సొంత ఇంటి నుంచే తరిమేశారు. విధి లేక ఆ తండ్రి ఆత్మకూరు వీధుల్లో, ప్రభుత్వాస్పత్రి, మున్సిపల్‌ కార్యాలయాల సమీపంలో కాలం వెళ్లదీస్తున్నాడు. తనను కన్న బిడ్డలు, కోడళ్లే కలిసి వేధిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆ వృద్ధుడు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఇది కుటుంబ పంచాయితీ, కోర్టులోనే తేల్చుకోండని అధికారులు చేతులెత్తేయడంతో ఆ తండ్రి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇతని కన్నీటి గాధ తెలిసిన ప్రతి ఒక్కరి మనసు చలించిపోతుందే కానీ కన్న కుమారులు, కోడళ్ల మనసులు మాత్రం కరగడం లేదు. చట్టాలు, సివిల్‌ నిబంధనల కంటే ముందు మానవతా ధృక్పథంతో స్పందించి, ఆ వృద్ధుడికి తగిన రక్షణ, ప్రశాంతమైన జీవితం లభించేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement