టెన్జింగ్‌ నార్గే అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

టెన్జింగ్‌ నార్గే అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Jul 26 2026 1:56 AM | Updated on Jul 26 2026 1:56 AM

నెల్లూరు రూరల్‌: కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే టెన్జింగ్‌ నార్గే జాతీయ సాహస అవార్డుల కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. 2023, 24, 25 సంవత్సరాల్లో భూమి, నీరు, గాలి విభాగాల్లో విశేష సాహస విజయాలు సాధించిన వారికి ఒక్కో అవార్డు.. సాహస రంగంలో విశిష్ట సేవలందించిన వారికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారని చెప్పారు. అవార్డు గ్రహీతలకు టెన్జింగ్‌ నార్గే కాంస్య విగ్రహం, ప్రశంసపత్రం, బ్లేజర్‌తో పాటు రూ.15 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారని వివరించారు. అర్హులు వచ్చే నెల 20లోపు awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం సదరు ప్రతితో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అదే రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఏకేనగర్‌లోని సెట్నెల్‌ కార్యాలయంలో అందజేయాలని కోరారు. కలెక్టర్‌, సెట్నెల్‌ చైర్మన్‌ ఆమోదం అనంతరం దరఖాస్తులను కమిషనర్‌, యువజన సర్వీసుల శాఖకు పంపనున్నామన్నారు. వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

విద్యార్థుల విజయమే

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయడం విద్యార్థి ఉద్యమం సాధించిన అతిపెద్ద విజయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాలాజీనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. నీట్‌ పేపర్‌ లీక్‌ కావడంతో విద్యార్థులు చేసిన ఉద్యమం దేశం మొత్తాన్నీ ప్రభావితం చేసిందన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వాన్ని కదిలించిందని, తప్పనిసరి పరిస్థితిల్లో ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఇది సమస్యకు పరిష్కారం కాదని, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి ఆ శాఖను ఆయా రాష్ట్రాలకు అప్పజెప్పడంతో పాటు నీట్‌ విధానాన్ని వికేంద్రీకరించాలని డిమాండ్‌ చేశారు.

చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్యా వ్యవస్థను కేంద్రం భ్రష్టు పట్టిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన పేరెంట్స్‌ టీచర్‌ మీటింగ్‌లో పిల్లలను కనాలని, వారే సంపద అని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తూ, పౌరులను సంపదతో పోల్చడం, పిల్లలను లాభాలు ఆర్జించే యంత్రాల్లా చూడటం సరికాదని హితవు పలికారు. పాలన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోకపోతే కేంద్రంలో మోదీ సర్కార్‌ ఏ విధంగా దెబ్బతింటుందో, అదే తరహా పరిస్థితి ఇక్కడా ఏర్పడుతుందని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, కార్యదర్శివర్గ సభ్యురాలు రెహనాబేగం పాల్గొన్నారు.

పారిశుధ్య మెరుగునకు

ప్రత్యేక చర్యలు

నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేలా చర్యలు చేపట్టాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి వివిధ మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గతంలో నిర్మించిన వర్మికంపోస్ట్‌ యానిట్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీల ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement