కావలి రూరల్: మండలంలోని తుమ్మలపెంట బీచ్ రోడ్డులో పశువుల ఆస్పత్రికి కేటాయించిన స్థలం కబ్జాకు గురైంది. ఆపై పక్కా భవనాలుగా నిర్మించి అద్దెలకిస్తున్న వైనం వెలుగు చూసింది. వాస్తవానికి మన్నంగిదిన్నె, తుమ్మలపెంట, అన్నగారిపాళెం పంచాయతీలకు చెందిన రైతుల సౌకర్యార్థం తుమ్మలపెంట పంచాయతీ పరిధిలో పశువుల ఆస్పత్రికి 20 సెంట్ల స్థలాన్ని 1994లో కేటాయించారు. అప్పట్నుంచీ ఇక్కడ పశువులకు వైద్యసేవలందిస్తూ వచ్చారు. అయితే దీనికి బిల్డింగ్ లేకపోవడంతో మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించారు. మిగిలిన 15 సెంట్ల స్థలాన్ని ఖాళీగా ఉంచారు. కాలక్రమంలో ఆ ప్రాంతంలో పశువులు ఎక్కువగా లేకపోవడం, గొల్లపాళెంలో ఉండటంతో గోపాలమిత్ర స్కీమ్‌ను అక్కడికి మార్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ స్థలంలో ఏడు రూమ్‌లను షాపులుగా నిర్మించి, విద్యుత్ మీటర్లను సైతం బిగించి అద్దెకిచ్చారు. పాత భవన పైభాగాన పశువుల వైద్యశాల, అన్నగారిపాళెం పంచాయతీ అనే బోర్డు నేటకీ కనిపిస్తూనే ఉంది. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా, అది తమ పరిధిలో లేదని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి ఆర్ అండ్ బీ ఉపక్రమించగా, విస్తరణకు ఇబ్బందిగా ఉండడంతో సదరు షాపుల యజమానులకు నోటీసులను జారీ చేశారు. పొరంబోకు స్థలాన్ని ఆక్రమించడంతో రోడ్డు నిర్మాణం ప్రస్తుతం నిలిచిపోయింది. కబ్జా చేసి రూమ్‌లు కట్టిన స్థలం ఆర్ అండ్ బీ పరిధిలో ఉంది.
ఆక్రమించిన భూమిలో నిర్మించిన షాపులు


