పేద రైతుల పొట్టగొడుతూ.. | - | Sakshi
Sakshi News home page

పేద రైతుల పొట్టగొడుతూ..

Jul 26 2026 1:56 AM | Updated on Jul 26 2026 1:56 AM

ఆత్మకూరు రూరల్‌: మండలంలోని రామస్వామిపల్లిలో పేద రైతులకు చెందిన భూముల ఆక్రమణల పర్వాన్ని కొందరు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ల్యాండ్స్‌ను కొనుగోలు చేసిన కొందరు సమీపంలోని పేదలకు చెందిన వాటినీ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. వీరికి తెలియకుండా జామాయిల్‌ చెట్లను నరికి విక్రయించి తీవ్ర నష్టాన్ని కలిగించారు. ఇదే అంశంపై గతంలో ఫిర్యాదు చేసినా, సమస్య ఏ మాత్రం పరిష్కారం కాలేదనే ఆవేదన వీరిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి గ్రామానికి చెందిన పల్లాల లక్ష్మమ్మ కుటుంబానికి సర్వే నంబర్లు 1567 – 2ఏ, 2బీలో భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈమె భర్త మాలకొండయ్యకు 1.44.. కుమారుడు మస్తాన్‌కు 1.13 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ పట్టా మంజూరైంది. జామాయిల్‌ మొక్కలు, నాటేందుకు అవసరమైన వ్యయం, నీటి సరఫరా తదితర సౌకర్యాలను సర్కార్‌ 2011లో కల్పించడంతో ఇందులో సాగు చేపట్టారు. తదనంతరం భర్త, కుమారుడ్ని కోల్పోయిన లక్ష్మమ్మ ప్రస్తుతం వృద్ధాప్యంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే సమయంలో పక్కనే కొనుగోలు చేసిన నెల్లూరుకు చెందిన పసుపులేటి సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు తమ వాటితో పాటు లక్ష్మమ్మ భూమినీ కలుపుకొని ఆమెకు తెలియకుండానే జామాయిల్‌ చెట్లను నరికి విక్రయించారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న తన మనవడు వచ్చాక పంటను విక్రయించాలని భావించామని, అయితే వీరిలా వ్యవహరించారని ఈమె ఆరోపించారు.

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు..?

గ్రామానికి చెందిన పొడమేకల సుందరయ్యకు సంబంధించిన భూ వ్యవహారం సైతం వివాదాస్పదంగా మారింది. సర్వే నంబర్‌ 380 – 2లో 1.8 ఎకరాలను 2003లో అగ్రిమెంట్‌ ద్వారా కొనుగోలు చేశారు. వ్యవసాయ బోరును ఇటీవల వేసి ఆయిల్‌పామ్‌ను సాగు చేసేందుకు సిద్ధమవుతుండగా, భూ రికార్డుల్లో మార్పులు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. భూములను పసుపులేటి సుబ్రహ్మణ్యం కొనుగోలు చేసే క్రమంలో పలువురు రైతుల ల్యాండ్స్‌ను సంబంధం లేని వ్యక్తులతో ఫోర్జరీ సంతకాలు చేయించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంక్‌ రుణాల కోసం ఈసీలు తీసుకున్న సమయంలో విషయం బయటపడింది. దీనిపై తహసీల్దార్‌, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కొందరికి న్యాయం.. మరికొందరికి నిరీక్షణ

కోర్టును కొందరు రైతులు ఆశ్రయించడంతో వారికి తిరిగి రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే తాము మాత్రం న్యాయం కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపులేటి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రాజకీయ అండదండలుండటంతో అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement