● పల్లిపాడు చెరువులో ఇదీ తంతు
● మూడు జేసీబీలు, 30కుపైగా ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలింపు
● 20 వేల క్యూబిక్ మీటర్ల మేర కొల్లగొట్టి
మర్రిపాడు: మండలంలోని పల్లిపాడు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు, అధికారిక పర్మిట్లు లేకుండానే మూడు జేసీబీలు, 30కుపైగా ట్రాక్టర్లతో చెరువు నుంచి మట్టిని పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 ఎకరాల మేర విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి, 20 వేల క్యూబిక్ మీటర్లకుపైగా మట్టిని తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ అండదండలతో ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో దందా నడుస్తున్నా.. ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ అధికారులు సమర్థంగా వ్యవహరించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా దీనిపై సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు శనివారం రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. మట్టి లోడుతో వెళ్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.


