నెల్లూరు రూరల్: పాస్‌పోర్టు సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాధికారి నందుల భూక్య సూచించారు. నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో గల పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని నెల్లూరు పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సేవా కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ, పత్రాల ధ్రువీకరణ, బయోమెట్రిక్ నమోదు, అపాయింట్‌మెంట్ నిర్వహణ తదితరాలను పరిశీలించి.. ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నందుల భూక్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాస్‌పోర్టు సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడం అధికారుల బాధ్యతని చెప్పారు. దరఖాస్తుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సమయపాలనతో సేవలందేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు.


